ఆ టాలెంటెడ్ హీరో తో 96 డైరెక్టర్ సినిమా లాకైందా?
సత్యం సుందరం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ప్రేమ్ కుమార్ ఇంకా తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసింది లేదు.
By: Tupaki Desk | 16 July 2025 11:58 AM ISTఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లున్నారు. కానీ అందులో ఆడియన్స్ మనసును హత్తుకునే సినిమాలు చేస్తూ, వారిని మెప్పించే డైరెక్టర్లు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి డైరెక్టర్లు వరుసపెట్టి సినిమాలు చేయకపోయినా, ఒకటి రెండు సినిమాలే చేసినా ఆడియన్స్ గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారు. అంతేకాదు వారి నుంచి తర్వాతి సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ కూడా చేస్తుంటారు.
అలాంటి డైరెక్టర్లలో కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కూడా ఒకరు. అప్పుడెప్పుడో కరోనాకు ముందు 2018లో విజయ్ సేతుపతితో కలిసి 96 సినిమా చేసిన ప్రేమ్ కుమార్ గతేడాది కార్తీ, అరవిందస్వామితో కలిసి సత్యం సుందరం అనే సినిమా చేశారు. ఈ సినిమాలతో ఆడియన్స్ లో తిరుగులేని గుర్తింపును దక్కించుకున్న ప్రేమ్ కుమార్ ఆ రెండు సినిమాలతో ఇండియన్ సినిమాకు మంచి క్లాసిక్స్ ను అందించారు.
సత్యం సుందరం వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ప్రేమ్ కుమార్ ఇంకా తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ప్రేమ్ కుమార్ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రేమ్ కుమార్, తమిళ స్టార్ హీరో విక్రమ్ తో తన తర్వాతి సినిమాను లాక్ చేసుకున్నారని తెలుస్తోంది. విక్రమ్ కు ప్రేమ్ ఓ కథను నెరేట్ చేయగా, అది విక్రమ్ ను బాగా ఇంప్రెస్ చేసిందని సమాచారం.
ఈ సినిమా యాక్షన్ సెంట్రిక్ సినిమాగా ఉండనుందని అంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే విక్రమ్- ప్రేమ్ కుమార్ కలయికలో రానున్న సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ముందు ప్రేమ్ కుమార్ 96 మూవీకి సీక్వెల్ చేద్దామనుకున్నారు కానీ తర్వాత తన ఆలోచనను మార్చుకుని విక్రమ్ కు కథ చెప్పారని సమాచారం. కాగా విక్రమ్ ప్రస్తుతం మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తన 63వ సినిమాను చేస్తున్నారు.
