డైరెక్టర్‌ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల కూడా తాను తీసిన పరదా సినిమా విషయంలో అంతే నమ్మకంగా ఉన్నారు.
By: Tupaki Desk | 10 Aug 2025 11:46 AM ISTకాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఎవరి సినిమా వాళ్లకు చాలా గొప్పనే. ఎలాంటి సినిమా తీసినా తాము తీసిన సినిమా గొప్పగానే ఉంటుందని చెప్పుకుంటారు. తమ సినిమాపై తమకున్న నమ్మకమే వారితో అలా మాట్లాడేలా చేస్తుంది. అయితే దాన్ని కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే మరికొందరు మాత్రం నమ్మకం అనుకుంటారు. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల కూడా తాను తీసిన పరదా సినిమా విషయంలో అంతే నమ్మకంగా ఉన్నారు.
రివ్యూలు బావుంటేనే సినిమా చూడండి
అదెంత నమ్మకమంటే తాను తీసిన సినిమా రిలీజయ్యాక రివ్యూలు బావుంటేనే తన సినిమాను చూడమని ఆడియన్స్ కు చెప్పేంత. సాధారణంగా డైరెక్టర్లు ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమ సినిమాపై తమకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప. అలాంటిది ప్రవీణ్ కండ్రేగుల పరదా విషయంలో నొక్కి మరీ రివ్యూలు చూసే వెళ్లండి అంటున్నారంటే తానెంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
మంచి కమర్షియల్ సినిమా తీశా
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ శనివారం జరగ్గా, ఆ ఈవెంట్ లో ప్రవీణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను లే, లడఖ్ లాంటి లొకేషన్లలో ఎంతో కష్టపడి చేశామని, తాను ప్రాపర్ కమర్షియల్ సినిమాను తీసినట్టు చెప్తూ, పరదా కోసం ఆడియన్స్ ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయకుండా టికెట్ కొని థియేటర్లలో చూడాలని కోరారు.
అనుపమను చూసి షాకవుతారు
పరదాలోని కంటెంట్ ప్రతీ ఒక్కరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందని, ఈ సినిమా అనుపమకు ఎంతో కీలక సినిమా అని, అరుంధతి సినిమాతో అనుష్క గారికి ఛాన్స్ ఇచ్చినట్టే ఇప్పుడు పరదాతో అనుపమ గారికి ఓ అవకాశమివ్వాలని, పరదా చూశాక అనుపమ యాక్టింగ్ చూసి అందరూ షాకవుతారని ప్రవీణ్ చెప్పారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 22న రిలీజ్ కానుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసింది. మరి పరదా గురించి డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకాన్ని సినిమా ఏ మేరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.
