Begin typing your search above and press return to search.

నటి ప్రత్యూష మృతి కేసు.. పూర్తి వివరాలివే!

ప్రత్యూష మరణానికి సిద్ధార్థ రెడ్డి కారణమని భావించిన హైదరాబాద్ సెషన్స్ కోర్టు, అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5000 జరిమానా విధించింది.

By:  Madhu Reddy   |   17 Feb 2026 1:45 PM IST
నటి ప్రత్యూష మృతి కేసు.. పూర్తి వివరాలివే!
X

రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ విషాద ఘటన వెనుక ఉన్న మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. హైకోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ, నిందితుడు సిద్ధార్థ రెడ్డి 4 వారాల లోపు పోలీసుల ఎదుట లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.. కేసు పూర్తి వివరాల్లోకి వెళితే ..

ప్రేమ, విషాదం,ఎన్నో ప్రశ్నలు:

తెలుగు తెరపై అప్పుడప్పుడే మెరుస్తున్న తార ప్రత్యూష. ఫిబ్రవరి 23, 2002న ప్రత్యూష , తన ప్రియుడు సిద్ధార్థ రెడ్డి కలిసి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగారు . ఆత్మహత్యాయత్నం చేశారు.. చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించగా, సిద్ధార్థ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు.దీంతో ఇది ప్రేమ విఫలమై చేసుకున్న ఆత్మహత్యగా ప్రచారం జరిగింది. అయితే, ప్రత్యూష కుటుంబం మాత్రం ఇది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆరోపించింది. అప్పట్లో రాజకీయ మరియు సినీ రంగాలకు చెందిన కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఈ కేసులో వినబడటం వల్ల ఈ ఇష్యూ మీడియాలో చిచ్చు రేపింది. ఫోరెన్సిక్ రిపోర్టులు విషం వల్లనే మరణం సంభవించిందని చెప్పినప్పటికీ, ఆ విషం ఆమె స్వయంగా తీసుకుందా లేక ఎవరైనా బలవంతంగా ఇచ్చారా అన్నది ఏళ్ల తరబడి మిస్టరీగా మారింది.

న్యాయ పోరాటం: కింది కోర్టు నుంచి సుప్రీం వరకు:

ప్రత్యూష మరణానికి సిద్ధార్థ రెడ్డి కారణమని భావించిన హైదరాబాద్ సెషన్స్ కోర్టు, అతనికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5000 జరిమానా విధించింది. అయితే, దీనిపై సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ శిక్షా కాలం రెండేళ్లకు తగ్గించబడింది. తన కూతురు మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెక్షన్ 302 (హత్య) లేదా సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష వేయాలని ఆమె తరపు లాయర్లు వాదించారు. ఇద్దరూ కలిసి విషం తీసుకున్నప్పుడు ఒకరిని మరొకరు ప్రేరేపించినట్టు ఎలా అవుతుందని సిద్ధార్థ తరపు వాదనలు నడిచాయి. ఈ సుదీర్ఘ వాదోపవాదాలు దాదాపు దశాబ్ద కాలం పైగా సాగి, కేసు ఒక కొలిక్కి వచ్చింది.

సుప్రీంకోర్టు సంచలన తీర్పు :

చివరికి ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టుమార్టం రిపోర్టులు, ఫోరెన్సిక్ ఆధారాలు , హెల్త్ రిపోర్ట్స్ వంటి ఏడు కీలకమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం.. సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అంతేకాకుండా, నాలుగు వారాల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డిని ఆదేశించింది. దీనితో రెండు దశాబ్దాల పాటు నడిచిన ఒక సంచలన కేసు ముగింపు దశకు చేరుకుంది.

ప్రత్యూష తల్లికి తప్పని బెదిరింపులు..

అప్పట్లో ప్రత్యూష తల్లికి కేసు గురించి కొందరు బెదిరించినట్టు ఆమె ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.. కొంతకాలం సెక్యూరిటీగా నలుగురు కానిస్టేబుల్స్ తన ఇంటి వద్ద వున్నట్టు.. తరువాత కేసు సాక్షాలు తారుమారు అయ్యాయి అని తెలిసాక ,బెదిరింపులు ఆగిపోయాయని ఆమె తెలిపారు. ఇక ఈ తీర్పు ప్రత్యూష కుటుంబానికి పూర్తి స్థాయి ఉపశమనం కాకపోయినా, చట్టం ముందు దోషి తేలడం ఒక కీలక పరిణామంగా నిలిచింది. ఒక వర్ధమాన నటి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం నేటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో ఒక తీరని వేదనగానే మిగిలిపోయింది.