Begin typing your search above and press return to search.

నాని హిట్ 3 విల‌న్ వెన‌క ఇంత క‌థ ఉందా?

బ్లాక్ నెట్ సైకో బ్యాచ్‌కు లీడ‌ర్ ఆల్ఫా క్యారెక్ట‌ర్‌లో న‌టించిన ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాడు.

By:  Tupaki Desk   |   9 May 2025 10:56 AM
Prateik Babbar Turns Heads with HIT 3
X

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `హిట్ ది థ‌ర్డ్ కేస్‌` ఇటీవ‌లే విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. శైలేష్ కొల‌ను తెర‌కెక్కించిన ఈ మూవీ వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ద‌స‌రా, స‌రిపోదా శ‌నివారం సినిమాల త‌రువాత నాని కెరీర్‌లో ఆ ఫీట్‌ని సాధించిన మూడ‌వ మూవీగా `హిట్ 3` నిల‌వ‌బోతోంది. ఇదిలా ఉంటే ఇందులో విల‌న్‌గా న‌టించిన ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ ఇప్పుడు వార్త‌ల్లో నిలుస్తున్నాడు.

బ్లాక్ నెట్ సైకో బ్యాచ్‌కు లీడ‌ర్ ఆల్ఫా క్యారెక్ట‌ర్‌లో న‌టించిన ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాడు. సైకోల‌కు బాస్‌గా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. క్లైమాక్స్‌లో సైకోల‌ని ఒక‌చోట‌కు చేర్చి వారితో ఆట‌లాడించి రాక్ష‌సానందం పొందే సైకోగా ప్ర‌తీక్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. దీంతో ప్ర‌తీక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో ప్ర‌తీక్ ఎవ‌రు? అత‌ని నేప‌థ్యం ఏంటీ అనే చ‌ర్చ మొద‌లైంది. అలా వెతుకుతున్న క్ర‌మంలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిశాయి.

ప్ర‌తీక్ మ‌రెవ‌రో కాదు 80వ ద‌శ‌కంలో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన క్రేజీ హీరోయిన్‌, నేచుర‌ల్ పెర్ఫార్మ‌ర్ స్మితా పాటిల్ త‌న‌యుడు. అంతే కాకుండా అదే స‌మ‌యంలో హీరోగా పాపుల‌ర్ అయిన రాజ్ బ‌బ్బ‌ర్ త‌న‌యుడు. స్మితా పాటిల్ బాలీవుడ్ హేమా హేమీలైన అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ఓంపురి వంటి న‌టుల‌తో క‌లిసి న‌టించింది. శ్యామ్ బెనెగ‌ల్ `చ‌ర‌ణ్‌దాస్ చోర్‌`, మిర్చీ మ‌సాలా, అంగారే, డ్యాన్స్ డ్యాన్స్‌, శ్యామ్ బెనెగ‌ల్ `అనురాగం (తెలుగు) వంటి త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి హీరోయిన్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా రెండు జాతీయ పుర‌స్కారాల్ని ద‌క్కించుకోవ‌డం విశేషం.

న‌టిగా త‌న ప్ర‌తిభ‌ను మెచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం ఆమెని చిన్న వ‌య‌సులోనే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారంతో స‌త్క‌రించింది. అంతే కాకుండా ఆమె గౌర‌వార్థం కేంద్ర ప్ర‌భుత్వం పోస్ట‌ల్ స్టాంప్‌ను కూడా విడుద‌ల చేయ‌డం విశేషం. ప్ర‌తీక్ పుట్టిన త‌రువాత రెండు వారాల‌కే అంటే 31 ఏళ్ల వ‌య‌సులోనే ఆమె క‌న్నుమూశారు. ఇద్ద‌రు సీనియ‌ర్‌ల త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిన ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్ 2008 నుంచి సినిమా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించాడు. అప్ప‌టి నుంచి న‌టుడిగా నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కాలం క‌లిసి రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే `హిట్ 3` కోసం ఫ్రెష్ ఫేస్‌ని వెతుకుతున్న ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను త‌ను అనుకున్న క్యారెక్ట‌ర్‌కు ప్ర‌తీక్ బబ్బ‌ర్ అయితేనే క‌రెక్ట్ అని భావించి అత‌నికి అవ‌కాశం ఇచ్చాడ‌ట‌. ఈ సినిమాతో అయినా ప్ర‌తీక్‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు రావాల‌ని ఆశిద్దాం.