సౌరవ్ గంగూలీ బయోపిక్.. సినిమాటోగ్రాఫర్ తొలగింపు వెనక!
ప్రతీక్ షాపై ఆరోపణలు ఇప్పుడే ప్రారంభం కాదు. నాలుగేళ్ల క్రితమే ఒక యువ సినిమాటోగ్రాఫర్ ఇండియన్ ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్ కలెక్టివ్ (IWCC)లో ఫిర్యాదు అందగా అతడు క్షమాపణలు చెప్పాడని మీడియాలో కథనాలొచ్చాయి.
By: Tupaki Desk | 3 Jun 2025 9:15 AM ISTగ్లామర్ ప్రపంచంలో ఆకర్షణలకు లొంగితే కెరీర్ ఖతమ్ అయినట్టే! ఇక్కడ స్త్రీల అందచందాలు, ఆకర్షణ ప్రభావానికి లోనయ్యే చాలా మంది యువ ప్రతిభావంతులు తమ కెరీర్ ని మధ్యలోనే ముగించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఒకసారి ఏదో ఒక కోణంలో బ్యాడ్ నేమ్ స్ప్రెడ్ అయితే అన్ని నిర్మాణ సంస్థలు వివాదాస్పద వ్యక్తిని దరిదాపుల్లోకి కూడా రానిచ్చే సాహసం చేయవు. ఆ ప్రభావం కోట్లాది రూపాయల విలువ చేసే ప్రాజెక్ట్ పై పడకుండా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే వివాదాస్పదులు కెరీర్ ఎప్పుడూ గాల్లో దీపంలాంటిది.
ఇప్పుడు కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక సినిమా `హోంబౌండ్` సెట్స్ లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన యువ సినిమాటోగ్రాఫర్ ప్రతీక్ షా కెరీర్ ఊగిసలాట మొదలైంది. అనుచిత ప్రవర్తన, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత చిత్ర పరిశ్రమ అతడిని నిర్ధయగా దూరం పెట్టడం ప్రారంభించిందని బాలీవుడ్ మీడియా కథనాలు వెలువరించింది.
ప్రీమియర్ కోసం హోమ్‌బౌండ్ టీమ్‌తో కలిసి కేన్స్‌లో ఉన్న ప్రతీక్ షాకు ఇది ఊహించని సెట్ బ్యాక్. వేధింపుల ఆరోపణలు వెలువడిన తర్వాత హోమ్‌బౌండ్ నిర్మాతలు ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు వేరొక నిర్మాణ సంస్థ అతడిని తొలగించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా కథనాల ప్రకారం.. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించనున్న సౌరవ్ గంగూలీ బయోపిక్ నుంచి, షెఫాలీ షా తదుపరి ప్రాజెక్ట్ నుండి ప్రతీక్ షాను తొలగించారని బాలీవుడ్ మీడియా ధృవీకరించింది. అతడు గంగూలీ బయోపిక్ కోసం లండన్ కూడా వెళ్లాడు. కానీ తాజా ఆరోపణల నేపథ్యంలో అతడిని తొలగించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ బయోపిక్ లో రాజ్ కుమార్ రావు టైటిల్ పాత్రను పోషించనున్నాడు. సినిమా చిత్రీకరణకు ముందు సినిమాటోగ్రాఫర్ తొలగింపు ఊహించనిది. మోత్వానే గతంలో సిఆర్.టి.ఎల్, జూబ్లీ చిత్రాల కోసం ప్రతీక్ షాతో కలిసి పనిచేశాడు. కానీ ఆ స్నేహం ఇక కొనసాగదు. నిర్మాతలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సమాచారం. అయితే సినిమాల నుంచి అతడిని తొలగించే ముందు ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ ICC ఏర్పాటు చేసారని తెలుస్తోంది.
ప్రతీక్ షాపై ఆరోపణలు ఇప్పుడే ప్రారంభం కాదు. నాలుగేళ్ల క్రితమే ఒక యువ సినిమాటోగ్రాఫర్ ఇండియన్ ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్ కలెక్టివ్ (IWCC)లో ఫిర్యాదు అందగా అతడు క్షమాపణలు చెప్పాడని మీడియాలో కథనాలొచ్చాయి.
