ఆ 'మాన్‌స్టర్' డైరెక్టర్ లో ఇంత ప్రేమ ఉందా..
ప్రశాంత్ నీల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కేజీఎఫ్ గనుల దుమ్ము, సలార్ బొగ్గు గనుల చీకటి. ఆయన సినిమాల్లో రక్తం ఏరులై పారుతుంది, తుపాకులు గర్జిస్తాయి.
By: Tupaki Desk | 12 Dec 2025 1:11 PM ISTప్రశాంత్ నీల్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది కేజీఎఫ్ గనుల దుమ్ము, సలార్ బొగ్గు గనుల చీకటి. ఆయన సినిమాల్లో రక్తం ఏరులై పారుతుంది, తుపాకులు గర్జిస్తాయి. స్క్రీన్ మీద వైలెన్స్ ను ఒక రేంజ్ లో చూపించే నీల్, బయట కూడా చాలా సీరియస్ గా, గంభీరంగా కనిపిస్తుంటారు. ఆయన కటౌట్ చూస్తేనే ఒక 'మాస్' వైబ్ వస్తుంది. కానీ ఆ గంభీరమైన ముఖం వెనుక ఒక చిన్న పిల్లవాడి మనసు ఉందని, ఒక సున్నితమైన తండ్రి ఉన్నాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ లో భాగంగా షూటింగ్ కోసం ప్రశాంత్ నీల్ బయలుదేరారు. అయితే ఆయన ఇంటి నుంచి కదిలే ముందు జరిగిన మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన భార్య షేర్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్ మనసు గెలుచుకుంటున్నాయి. ఇన్నాళ్లు మనం చూసిన డైరెక్టర్ వేరు, ఇప్పుడు చూస్తున్న మనిషి వేరు అన్నట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి.
ఆ ఫోటోలలో ప్రశాంత్ నీల్ తన కూతురిని గట్టిగా హత్తుకోవడం మనం చూడవచ్చు. షూటింగ్ కోసం ఇంటికి దూరంగా వెళ్తున్నప్పుడు వచ్చే బాధ, ఆ ప్రేమ ఆ కౌగిలింతలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, గుమ్మం దగ్గర పాపను ఎంతో ఆప్యాయంగా ముద్దాడుతున్న దృశ్యం నిజంగా హార్ట్ టచింగ్ అని చెప్పాలి. స్క్రీన్ మీద వందల మందిని నరికే క్యారెక్టర్లను సృష్టించే ఈ దర్శకుడు, కూతురి ముందు మాత్రం కరిగిపోయే మంచులా మారిపోయాడనేది ఇక్కడ అసలైన పాయింట్.
నిజానికి ఒక పాన్ ఇండియా డైరెక్టర్ మీద ఉండే ఒత్తిడి మామూలుగా ఉండదు. వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోల ఇమేజ్, ఫ్యాన్స్ అంచనాలు.. ఇవన్నీ మోయడం అంత సులువు కాదు. కానీ ప్రశాంత్ నీల్ కు ఆ శక్తిని ఇచ్చేది బహుశా ఇలాంటి ఫ్యామిలీ బాండింగే కావచ్చు. బయట ప్రపంచానికి ఆయనో సెలబ్రిటీ అయినా, ఇంటి గడప లోపల మాత్రం ఆయనొక బాధ్యతగల, ప్రేమగల తండ్రి మాత్రమే. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ వల్లే ఆయన అంత పెద్ద సినిమాలను డీల్ చేయగలుగుతున్నారనిపిస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఎంత వైలెన్స్ ఉన్నా, అందులో ఒక బలమైన 'అమ్మ సెంటిమెంట్' లేదా 'లవ్, హ్యూమన్ ఎమోషన్' కచ్చితంగా ఉంటుంది. బహుశా తన నిజ జీవితంలోని ఈ ఎమోషనల్ కోణం నుంచే ఆయన ఆ కథలను రాసుకుంటారేమో. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ సినిమాలో ఎలాంటి ఎమోషన్స్ ని హైలెట్ చేస్తాడో చూడాలి.
