అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నా
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎంతో ఎక్కువ ఉంది. అయినప్పటికీ టాలెంటెడ్ హీరోయిన్లు కొన్ని సినిమాలకే పరిమితమవుతూ వస్తున్నారు.
By: Tupaki Desk | 17 Jun 2025 12:00 AM ISTసినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఎంతో ఎక్కువ ఉంది. అయినప్పటికీ టాలెంటెడ్ హీరోయిన్లు కొన్ని సినిమాలకే పరిమితమవుతూ వస్తున్నారు. అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది అలా మెరిసి ఇలా మాయమవుతుంటే, ఇంకొందరు సినిమాలు మానేసి పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు. దీంతో ఫ్యాన్స్ వారిని సినిమాల్లో చూడటాన్ని మిస్ అయిపోతున్నారు.
ఇక చేసేదేమీ లేక వారిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ముచ్చట పడుతున్నారు. అలా సినిమాలు చేస్తూ చేస్తూ సడెన్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఓ హీరోయిన్ కోసం కూడా నెటిజన్లు నెట్టింట తెగ వెతుకుతున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాపు గారి బొమ్మ ప్రణీతా సుభాష్. అమ్మడికి అందం, అభినయం ఉన్నా కూడా కోరుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది.
హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి ఆడియన్స్ ను మెప్పించిన ప్రణీతా ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాలోనే తన క్యూట్ లుక్స్ తో ఆడియన్స్ ను మెప్పించిన ప్రణీతా ఆ తర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది. హీరోయిన్ గా అనుకున్న గుర్తింపు రాకపోవడంతో ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా కూడా తన లక్ ను టెస్ట్ చేసుకుంది.
సెకండ్ హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన అత్తారింటికి దారేది సినిమా ప్రణీతాకు మంచి సక్సెస్ ను అందించింది. అయినా ఆ హిట్ తన కెరీర్ కు ఏమంత ఉపయోగపడలేదు. దీంతో కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది ప్రణీతా. ఇప్పుడు ప్రణీతకు ఇద్దరు పిల్లలు కూడా. పెళ్లి తర్వాత ప్రణీతా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు మాత్రం టచ్ లోనే ఉంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉండే ప్రణీతాను రీసెంట్ గా ఓ అభిమాని మీరు సినిమాల్లో ఎందుకు నటించడం లేదని అడగ్గా, దానికి ప్రణీతా తన పిల్లల వల్లే తాను సినిమాల్లో నటించడం లేదని, వారిని చూసుకోవడానికి సినిమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రణీతా వెల్లడించింది. పిల్లల కోసం కెరీర్ ను వదిలేసిన ప్రణీతాను ఇప్పుడంతా మెచ్చుకుంటున్నారు.
