పవన్ ను ట్రాప్ చేస్తున్నారు : నటుడు ప్రకాష్ రాజ్ షాకింగ్ స్టేట్మెంట్
తాజాగా బీజేపీ ప్రమాదకరపార్టీగా అభివర్ణించిన ప్రకాష్ రాజ్.. బీజేపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ట్రాప్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 5 May 2025 3:45 PMసీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ మరోమారు గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ, దాని హిందుత్వ అజెండాను తీవ్రంగా వ్యతిరేకించే ప్రకాష్ రాజ్.. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియా పోస్టులతోపాటు యూట్యాబ్ ఇంటర్వ్యూల్లోనూ పవన్ పై విమర్శలు గుప్పిస్తారు. తాజాగా బీజేపీ ప్రమాదకరపార్టీగా అభివర్ణించిన ప్రకాష్ రాజ్.. బీజేపీ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ట్రాప్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ పై ఎప్పుడూ విమర్శలు గుప్పించే ప్రకాష్ రాజ్ ఈ సారి కాస్త డోసు పెంచారు. పవన్ భుజాలపై బీజేపీ నేతలు చేతులు వేస్తున్నది వారు ఎదగడానికే కానీ, పవన్ కోసం కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. బీజేపీతో పవన్ ప్రయాణాన్ని ముంబై లోకల్ ట్రయన్ తో పోల్చిన ప్రకాష్ రాజ్.. ముంబై లోకల్ ట్రైన్ కోసం వేచిచూసేవారు రైలులో ఎక్కాల్సిన అవసరం లేదని, అక్కడ నిల్చుంటే తోటి ప్రయాణికులే ఎక్కించేస్తారన్నారు. ఇప్పుడు పవన్ ప్రయాణం కూడా బీజేపీ చెప్పినట్లే ఉందని వ్యాఖ్యానించారు.
పవన్ కోసం ఆయన సొంత నియోజకవర్గంలో చాలా సమస్యలు ఎదురుచూస్తున్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గ సమస్యల పరిష్కారాన్ని వదిలేసి తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎందుకని పవన్ ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడుగా గుర్తింపు ఉన్న ప్రకాష్ రాజ్ తరచుగా బీజేపీ విధానాలపై విమర్శలు గుప్పిస్తుంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకున్న నాటి నుంచి ఆయనపైనా విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం బయటపడినప్పుడు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. అదేవిధంగా హిందీ భాష, సనాతన ధర్మం వంటివాటిపై పవన్ మాట్లాడినప్పుడల్లా ప్రకాష్ రాజ్ స్పందిస్తుంటారు. అదేసమయంలో ప్రకాష్ రాజ్ ను ఆర్ఎస్ఎస్, బీజేపీ శ్రేణులు కూడా తీవ్రంగా విమర్శిస్తుంటాయి.