Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌పై ప్ర‌కాష్ రాజ్ క్రేజీ కామెంట్స్!

ఇటీవ‌ల శివాజీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయ‌న తాజాగా మ‌రోసారి వార్తల్లో నిలిచారు. కేర‌ళ‌లోని కోజికోడ్‌లో కేర‌ళ లిట‌రేచ‌ర్ ఫెస్టివెల్‌లో ప్ర‌కాష్ రాజ్ పాల్గొన్నారు.

By:  Tupaki Entertainment Desk   |   26 Jan 2026 5:33 PM IST
బాలీవుడ్‌పై ప్ర‌కాష్ రాజ్ క్రేజీ కామెంట్స్!
X

కోలీవుడ్ టు బాలీవుడ్ వ‌ర‌కు విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు ప్ర‌కాష్ రాజ్‌. విల‌న్ పాత్ర‌ల‌కు ప్రత్యేక‌త‌ను తీసుకొచ్చి న‌టుడిగా జాతీయ స్థాయిలో గుర్తుంపుని సొంతం చేసుకున్నారు. గ‌త కొంత కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్ర‌భుత్వంపై, ప్ర‌దాని న‌రేంద్ర మోదీపై విమ‌ర్శ‌లు చేస్తూ త‌రచూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇటీవ‌ల శివాజీ వివాదంపై ఘాటుగా స్పందించిన ఆయ‌న తాజాగా మ‌రోసారి వార్తల్లో నిలిచారు. కేర‌ళ‌లోని కోజికోడ్‌లో కేర‌ళ లిట‌రేచ‌ర్ ఫెస్టివెల్‌లో ప్ర‌కాష్ రాజ్ పాల్గొన్నారు.




ఈ సంద‌ర్భంగా బాలీవుడ్‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. బాలీవుడ్ ప్ర‌స్తుతం త‌న మూలాల‌ని రోల్పోయింద‌ని, ఎంచుకుంటున్న క‌థ‌ల్లో పూర్తిగా ఆత్మ‌ను పూర్తిగా వ‌దిలేసింద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అంతే కాకుండా బాలీవుడ్ పైకి ఎంతో అందంగా, క‌ల‌ర్ ఫుల్‌గా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ లోప‌ల మాత్రం జీవం లేని డొల్ల‌గా మారింద‌న్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌ను మూడ‌మ్ టుస్సాడ్స్‌లోని మైన‌పు విగ్ర‌హాల‌తో పోలుస్తూ ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఈ సంద‌ర్భంగా ద‌క్షిణాది ఇండ‌స్ట్రీల‌పై ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. త‌మిళ‌, మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు బ‌ల‌మైన క‌థ‌ల‌ని తీస్తున్నారు. మ‌ట్టిక‌థ‌ల‌ని, స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను, ద‌ళితుల ఆవేద‌న‌ను ఎంతో స‌హ‌జ‌త్వంతో వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. మ‌న మూలాలు మ‌న క‌థ‌ల్లో ఉండాలి. అలా ఉన్న‌ప్పుడే అవి ప్రేక్ష‌కుల‌కు చేరువ‌వుతాయి. అలా కాకుండా గ్లామ‌ర్ వెంట ప‌రుగెత్త‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటే అలాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు దూర‌మ‌వుతాయన్నారు.

త‌మిళంలో రూపొందిన `జై భీమ్‌`, మామ‌న్న‌న్ వంటి సినిమాలు స‌మాజంలో మార్పుకు నాందిప‌ల‌కాల‌ని సూచిస్తుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం మూలాల‌ని మ‌ర్చిపోయి గ్లామ‌ర్‌, డ‌బ్బు, లుక్స్‌, రీల్స్‌, ప్ర‌మోష‌న్స్ వంటి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కే ప‌రిమిత‌మైంద‌ని, ఆ కార‌ణంగానే బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కాస్త దూర‌మైంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ప్ర‌కాష్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెరలేపాయి. ఉన్న‌ట్టుండి ప్ర‌కాష్ రాజ్ బాలీవుడ్‌పై ఎందుకు విరుచుప‌డుతున్నార‌ని, త‌న‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డ‌మే తాజా విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మా? అని అంతా ఆరాతీస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్ర‌కాష్ రాజు అంత‌రిక్ష వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్‌తో క‌లిసి ఓ ఫొటో దిగారు. ఇది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపుని పొందిన వ్య‌క్తితో ఇలా ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటున్న ప్ర‌కాష్ రాజ్ ప్ర‌స్తుతం వార‌ణాసి, స్పిరిట్‌, గూఢ‌చారి 2, డెకాయిట్‌, ఫాద‌ర్‌, మిరాకిల్ వంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఇందులో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాల‌తో పాటు పాన్ ఇండియా మూవీస్‌కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.