'నాకే కాదు, మా అమ్మ వాళ్లకూ తెలియదు'.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై మళ్లీ..
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణం అనంతరం ఆమె లైఫ్ జర్నీ, తన కుటుంబ పరిస్థితుల గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
By: M Prashanth | 7 July 2026 8:48 AM ISTప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణం అనంతరం ఆమె లైఫ్ జర్నీ, తన కుటుంబ పరిస్థితుల గురించి ఆయన వెల్లడించిన విషయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా "నాకే కాదు.. మా అమ్మ వాళ్లకు కూడా తమ జాతి, కులం ఏంటో తెలియదు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రకాష్ రాజ్.. "నన్ను ఎవరైనా అడిగితే నేను ముందుగా మనిషినని చెబుతాను. నటన నా వృత్తి. చదవడం, రాయడం నా ఇష్టం. నాకు స్పందించే గుణం చిన్నప్పటి నుంచే ఉంది. నాకు కులం, మతం అనే ఫీలింగ్స్ లేవు. 1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకు వలస వచ్చారు. మా అమ్మ 12 ఏళ్ల వయసులోనే అనాధ అయ్యారు. ఆమె తల్లి చనిపోయిన తర్వాత తండ్రి కూడా దూరమయ్యారు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు ఉన్నారు" అని తెలిపారు
"అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మను ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేశారు. వాళ్లకు తమ జాతి, చుట్టాలు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు" అని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత ఇటీవల వయసు రీత్యా తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే దేవుడిని నమ్మనని పలుమార్లు బహిరంగంగా చెప్పిన ప్రకాష్ రాజ్.. తల్లికి మతపరమైన అంత్యక్రియలు నిర్వహించడంపై సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక నెటిజన్ ప్రకాష్ రాజ్ గతంలో తాను నాస్తికుడినని చెప్పిన వీడియోతో పాటు, తల్లి అంత్యక్రియల వీడియోను కలిపి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విమర్శలు గుప్పించారు. దీనిపై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు.
"అవును.. నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మ తన దేవుడిని నమ్మేది. ఆమె నమ్మకాన్ని గౌరవించడం నా బాధ్యత. ఆమె విశ్వాసం ప్రకారం అంత్యక్రియలు పొందే హక్కును నేను ఎలా కాదంటాను? ఒకరి నమ్మకాన్ని మరొకరు గౌరవించుకోవడం అంటే ఇదే. ద్వేషంతో చూసేవారికి ఇది అర్థం కాదు" అని ఆయన సమాధానమిచ్చారు. తల్లి మరణం తర్వాత కూడా ప్రకాష్ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు.
తల్లి పాత ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ.. "మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అమ్మా.. ప్రతిదానికీ థ్యాంక్యూ. నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అని రాశారు. గతంలో తన తల్లికి బ్రెయిన్ సిస్ట్ ఆపరేషన్ జరిగిందని, ఆ తర్వాత ఆమె జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడ్డారని కూడా వెల్లడించారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చెప్పిన కుటుంబ నేపథ్యం, కులం- మతం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి.
