సినిమాలు తగ్గిపోవడంపై ప్రకాష్ రాజ్
ఐతే ప్రకాష్ రాజ్ మాత్రం తనకు ఛాన్సులు తగ్గడానికి వేరే కారణం ఉందంటున్నారు.
By: Tupaki Desk | 5 May 2025 9:18 PM ISTఒకప్పుడు సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్లలో ప్రకాష్ రాజ్ ఒకరు. కానీ గత దశాబ్ద కాలంలో ఆయన సినిమాలు చేయడం బాగా తగ్గిపోయింది. ఆయన చేసే విలన్, క్యారెక్టర్ రోల్స్ వేరే నటులకు వెళ్లిపోయాయి. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఆయన ఒక దశలో రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. అలాగే దర్శకులు మార్పు కోరుకున్నారు. ప్రకాష్ రాజ్ నటన కూడా మూసగా మారి ఆయనకు అవకాశాలు తగ్గాయి అని చెప్పొచ్చు.
ఐతే ప్రకాష్ రాజ్ మాత్రం తనకు ఛాన్సులు తగ్గడానికి వేరే కారణం ఉందంటున్నారు. తాను రాజకీయాలపై సూటిగా మాట్లాడతాను కాబబ్టి, తనతో సినిమాలు చేస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో తనతో పని చేయడానికి ఇతరులు ఇష్టపడట్లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘‘నేను ఏదైనా సూటిగా మాట్లాడతాను. రాజకీయ అంశాల పైనా అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతుంటా. నాతో వర్క్ చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారు భావిస్తుండొచ్చు. అందుకే అవకాశాలు తగ్గాయి. ఇలాంటి పరిస్థితి చూసిన తర్వాతే విషయం ఏదైనా గళం విప్పాలనే భావన నాకు కలిగింది’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ఇక బాలీవుడ్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. అక్కడి నటుల్లో సగం మంది అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వం ఏదైనా సరే చర్చలను అణచివేస్తుంది. ఒక విషయంపై మాట్లాడాలా వద్దా అన్నది నటీనటులపై ఆధారపడి ఉంటుంది. నిజం చెప్పాలంటే వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరంటే.. ఇండస్ట్రీలోని సగం మంది నటీనటులు అమ్ముడుపోయారు. మరి కొందిరికి మాట్లాడే ధైర్యం లేదు. నా ఫ్రెండొకరు ఇదే విషయం చెప్పారు. నాకు ధైర్యం ఉంది కాబట్టి మాట్లాడుతున్నానని, తనకా ధైర్యం లేదని అన్నాడు. ఈ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.
