కారవ్యాన్‌లో మల విసర్జన చేసారు.. నటుడి సంచలన ఆరోపణలు
అయితే ప్రకాష్ బెలవాడీ తాజాగా కన్నడ సినీరంగంపై తీవ్ర ఆరోపణలు చేసారు.
By: Tupaki Desk | 28 Jun 2025 3:00 PM IST'సాహో' చిత్రంలో నేచురల్ పెర్ఫామర్ గా మనసులు గెలుచుకున్న నటుడు ప్రకాష్ బెలవాడీ. ఎంపిక చేసుకున్న పాత్రకు తగ్గట్టు అతడు తన ఆహార్యాన్ని మార్చుకుని అందరినీ మెప్పించగలడు. అతడు హిందీ సినీరంగంతో పాటు, దక్షిణాదిన కన్నడం, తెలుగు పరిశ్రమలకు సుపరిచితుడు. నాటక రంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన బెలవాడీ పెర్ఫామెన్స్ కి ప్రత్యేకించి ఫ్యాన్సున్నారు. సౌత్ లోను అతడికి సాహో తర్వాత చాలా ఫాలోయింగ్ ఏర్పడింది.
అయితే ప్రకాష్ బెలవాడీ తాజాగా కన్నడ సినీరంగంపై తీవ్ర ఆరోపణలు చేసారు. ఓ ప్రముఖ బ్యానర్ తనకు పారితోషికం బకాయి చెల్లించకుండా ముప్పు తిప్పలు పెట్టిందని, కారవ్యాన్ లో తనను అవమానించారని ఆరోపించాడు. అంతేకాదు.. మొత్తం కన్నడ ఇండస్ట్రీని ఇది ప్రతిబింబిస్తుందని కూడా అన్నాడు. ఆ పెద్ద బ్యానర్ ఏదో చెప్పలేను. ఈ బ్యానర్ లో మరో అవకాశం రాదనే భయం తనకు లేదని, కానీ అది పెద్ద బ్యానర్ కావడంతో భయపడుతున్నానని కూడా అన్నాడు.
పారితోషికం తగ్గించుకోమని బ్యానర్ సిబ్బంది కోరారు. కానీ తాను దానికి నిరాకరించినందున చివరి రోజు షూటింగ్ లో తన కారవ్యాన్ లోకి వచ్చిన కొందరు చాలా ఇబ్బందికి గురి చేసారని, అవమానించారని తెలిపాడు. తాను ఉన్న కారవ్యాన్ లోకి కొందరు వచ్చారు. తిని తాగి అక్కడే ఖరాబ్ చేసారు. టాయ్ లెట్ లో నీళ్లు మొత్తం బయటకు వదిలేసారు. మలమూత్రాలను విసర్జించారు. ఆ దుర్వాసన భరించలేక నేను చివరికి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అది బాధాకర అనుభవం! అని గత అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. వీరంతా కన్నడిగులు కాదు. కన్నడిగులు సంస్కారవంతులు. రాజ్ కుమార్ కుటుంబంతో పని చేయడం అంటే అది ఎంతో గౌరవంతో కూడుకున్నది.. వారి ప్రవర్తన వేరు అని అన్నాడు. తనకు చెల్లించాల్సిన చివరి ఇన్ స్టాల్ మెంట్ ని చెల్లించలేదని, ఇప్పుడు తనకు ఒక రోజుకు 10లక్షలు ఇచ్చినా ఆ బ్యానర్ లో నటించలేనని అన్నాడు.
తెలుగులో సాహో చిత్రంలో నటించిన బెలవాడీ మద్రాస్ కేఫ్, ఇండియా లాక్‌డౌన్, ది కాశ్మీర్ ఫైల్స్, ఎయిర్‌లిఫ్ట్, ది తాష్కెంట్ ఫైల్స్ వంటి సినిమాల్లో చక్కని పాత్రలతో ఆకట్టుకున్నాడు. కన్నడలోను పలు హిట్ చిత్రాల్లో అతడు నటించాడు.
