Begin typing your search above and press return to search.

పాపరాజీ లపై మొన్న సమంత, ఇప్పుడు ప్రగ్యా... చిరాకు ఎందుకు?

గతంలో సినిమా స్టార్స్ రోడ్డు మీదకు వస్తే అభిమానుల తాకిడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

By:  Tupaki Desk   |   7 July 2025 9:34 AM
పాపరాజీ లపై మొన్న సమంత, ఇప్పుడు ప్రగ్యా... చిరాకు ఎందుకు?
X

గతంలో సినిమా స్టార్స్ రోడ్డు మీదకు వస్తే అభిమానుల తాకిడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అభిమానుల కంటే ఎక్కువగా పాపారాజిలు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చేస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు. ముంబైలో ఈ పాపరాజీ ఎక్కువ అవుతోంది. సెలబ్రిటీలకు కనీసం ప్రైవసీ లేకుండా చేయడంతో చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హీరోయిన్‌ సమంత సైతం పాపరాజీ పై అసహనం వ్యక్తం చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. శృతి మించుతున్నారు అంటూ వారి పై అసహనం వ్యక్తం చేసింది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్‌ సైతం ఇదే విషయమై అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఒక పార్టీలో పాల్గొన్న ప్రగ్యా జైస్వాల్‌ అందరిలాగే మీడియా ఫోటోగ్రాఫర్స్‌కి ఫోజ్ ఇచ్చింది. స్టిల్స్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్తూ ఉండగా కొందరు పాపరాజీలు కేకలు వేస్తూ ప్రగ్యా జైస్వాల్‌ను కామెంట్స్ చేశారు. దాంతో ప్రగ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెనక్కి తిరిగి చూసింది. ఆ సమయంలో ప్రగ్యా చూసిన చూపు ఆమె అసహనం ను వ్యక్తం చేస్తుంది. పాపరాజీలు ఎప్పటికప్పుడు శృతి మించుతున్నారు, వారి పరిధి దాటిన ప్రతి సారి సెలబ్రిటీలు ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్స్ వారిని సున్నితంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా కూడా వారు తగ్గడం లేదు.

సెలబ్రిటీలు ముఖ్యంగా స్టార్‌ హీరోయిన్స్ పాపరాజీలపై అసహనం వ్యక్తం చేయడంను కొందరు తప్పుబడుతున్నారు. వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేస్తేనే మీకు పబ్లిసిటీ దక్కుతుంది. వారి అవసరం ఉన్నప్పుడు వారి ముందుకు వచ్చి మరీ ఫోటోలకు ఫోజ్‌లు ఇస్తారు. కానీ కొన్ని సార్లు మాత్రం వారిని తిడుతూ ఉన్నారు. వారిపై అంతలోనే ఎందుకు అంత కోపం అంటూ ప్రశ్నిస్తున్నారు. పాపరాజీలను విమర్శించిన వారిలో చాలా మంది హీరోయిన్స్‌ ఉన్నారు. కొందరు మాత్రం వారు ఎంతగా విసిగించినా మౌనంగా ఉంటూ, చిరు నవ్వుతో ఉన్నారు. కానీ కొందరు మాత్రం అలా ఉండలేక పోతున్నారు. అందుకే పాపరాజీల తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

మీడియా వారిపై అసహనం వ్యక్తం చేయడం ఏమాత్రం సబబు కాదని చాలా మంది సెలబ్రిటీలు మౌనంగా ఉంటారు, కానీ పాపరాజీలు వారి లైన్‌ ను క్రాస్‌ చేస్తే సమంత వంటి స్టార్‌ హీరోయిన్స్‌ అసహనం వ్యక్తం చేయడం, వారిపై ఆగ్రహం కనబర్చడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్‌ సైతం తన అసంతృప్తిని వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక స్థాయి వరకు హద్దు ఉంటుంది, ఆ హద్దు మీరితే ఖచ్చితంగా ఎవరికి అయినా కోపం వస్తుంది. ఇప్పుడు వరుసగా హీరోయిన్స్‌ పాపరాజీలపై ఆగ్రహం వ్యక్తం చేయడంకు కారణం ఇదే. వారు ఇకపై అయినా హద్దుల్లో ఉంటే మంచిదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.