Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్ట‌ర్..ఇది క‌దా జ‌ర్నీ అంటే!

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి లైఫ్ ఎలా ట‌ర్న్ అవుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.. రాత్రికి రాత్రే జీవితాలు తారుమారయ్యే రంగం ఏదైనా ఉందంటే అది సినిమా రంగ‌మే.

By:  Ravindar Gorantla   |   25 Feb 2026 7:00 AM IST
యంగ్ డైరెక్ట‌ర్..ఇది క‌దా జ‌ర్నీ అంటే!
X

సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రి లైఫ్ ఎలా ట‌ర్న్ అవుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.. రాత్రికి రాత్రే జీవితాలు తారుమారయ్యే రంగం ఏదైనా ఉందంటే అది సినిమా రంగ‌మే. ఇక్క‌డ రాత్రికి రాత్రే అద్భుతాలు చేసిన వారున్నారు. అలాగే క‌నుమ‌రుగైన వారు కూడా ఉన్నారు. అయితే టాలెంట్ ఉంటే వారి లైఫ్ ఎప్ప‌టికైనా ఊహించ‌ని స్థాయికి వెళుతుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. సినిమా ఇండ‌స్ట్రీలో టాలెంట్‌, అదృష్టం రెండూ ఉంటే వారి లైఫ్ ఊహించ‌ని స్థాయికి చేరుకుంటుంద‌న్న‌ది చాలా మంది విష‌యాల్లో నిజ‌మైంది.

యంగ్ డైరెక్ట‌ర్ ట‌ర్న్‌డ్ క్రేజీ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌ విష‌యంలో ఇప్పుడు అక్ష‌రాలా ఇదే జ‌రిగి అంద‌రిని ఆశ్చ‌ర్యప‌రుస్తోంది. ఏడేళ్ల జ‌ర్నీలో ప్ర‌దీప్ అద్భుతాలు చేసి చూపించాడు. ఊహించని స్థాయికి చేరుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే...కోలీవుడ్ యంగ్ క్రేజీ డైరెక్ట‌ర్ క‌మ్‌ హీరోల్లో ఇప్పుడు రైజింగ్‌లో ఉన్న స్టార్ ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. చెన్నైలోని ఓ సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఫ్యామిలీకి చెందిన ప్ర‌దీప్ ఇంజినీరింగ్ పూర్త‌య్యాక ఆయన తండ్రి ర‌న్ చేస్తున్న జిరాక్స్ షాప్‌ని న‌డుపుతూ స్నేహితుల స‌హాయంలో షార్ట్ ఫిలింస్ చేస్తుండేవాడు.

వాట్స‌ప్ కాద‌ల్, యాప్ లాక్ షార్ట్ ఫిలింస్‌తో పాపుల‌ర్ అయిన ప్ర‌దీప్ రంగ‌నాథన్‌ 2019లో ర‌విమోహ‌న్ (జ‌యం ర‌వి), కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా 'కోమాలి' సినిమా చేశాడు. ఇది అత‌ని ఫ‌స్ట్ డైరెక్టోరియ‌ల్ మూవీ. దీనికి రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా త‌ను అందుకున్న ప‌రితోషికం అక్ష‌రాలా రూ.50 ల‌క్ష‌లు మాత్ర‌మే. త‌ను రూపొందించిన `యాప్ లాక్` షార్ట్ ఫిల్మ్ స్టోరీనే 'ల‌వ్ టుడే'గా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని డైరెక్ట‌ర్‌గా, హీరోగా అందుకుని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు త‌న‌కు ద‌క్కిన పారితోషికం రూ.70 ల‌క్ష‌ల నుంచి 80 మ‌ధ్య‌లో..

అయితే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో ఏజీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు ప్ర‌దీప్‌కు మ‌రింత మొత్తాన్ని అందించ‌డంతో ఈ మూవీకి త‌ను అందుకున్న పారితోషికం రూ.1.50 కోట్లు చేరింది. ఇక అశ్వ‌త్ మారిముత్తు డైరెక్ట్ చేసిన 'డ్రాగ‌న్‌' మూవీకి క‌థ అందించి హీరోగా న‌టించినందుకు గానూ ప్ర‌దీప్‌కు రూ.10 కోట్ల వ‌ర‌కు పారితోషికం అందింది. ఇక తెలుగు, త‌మిళ భాష‌ల్లో చేసిన 'డ్యూడ్‌' మూవీకి రూ.12 కోట్లు పారితోషికం అందుకున్నాడు. త‌ను హీరోగా న‌టించిన మూడు సినిమాల్లో 'ల‌వ్ టుడే' రూ.105 కోట్లు రాబ‌ట్ట‌గా, డ్రాగ‌న్ రూ.150 కోట్లు వ‌సూలు చేసింది.

ఇక తెలుగు, త‌మిళ భాష‌ల్లో నిర్మించిన 'డ్యూడ్‌' మూవీ రూ.100 కోట్ల‌కు పైనే రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ రూపొందిస్తున్న 'ల‌వ్ ఇన్సురెన్స్ కంప‌నీ'లో న‌టిస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ఎస్‌.జె.సూర్య, మిస్కిన్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌దీప్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీ ఇది. త్వ‌ర‌లోనే రిలీజ్ కానుంది. ప్ర‌స్తుతం ప్ర‌దీప్ రంగ‌నాథన్‌ కోసం టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు క్యూ క‌డుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.25 కోట్ల మేర‌కు పారితోషికం ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నాయి. రూ.50 ల‌క్ష‌ల పారితోషికం నుంచి ఏడేళ్ల జ‌ర్నీలో రూ.25 కోట్ల‌కు ప్ర‌దీప్ రంగ‌నాథన్‌ ఎదిగిన తీరు ఎంతో మంది కొత్త వారికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ప్ర‌దీప్ ఏడేళ్ల ఎదుగుద‌ల‌ను చూసిన వారంతా ఇది క‌దా జ‌ర్నీ అంటే అని ముచ్చ‌ట‌ప‌డుతున్నారు.