ప్రేమ- పెళ్లి.. నిర్ణయించేది AI.. వెండితెరపై ప్రయోగం!
ప్రస్తుత ఆధునిక కాలంలో సాంకేతికత మనిషి జీవితంలో విడదీయలేని భాగమైంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (ఎల్ఐకే) అనే వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
By: Sivaji Kontham | 6 April 2026 10:17 AM ISTప్రస్తుత ఆధునిక కాలంలో సాంకేతికత మనిషి జీవితంలో విడదీయలేని భాగమైంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (ఎల్ఐకే) అనే వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఐ సాంకేతికత భవిష్యత్తులో మానవ సంబంధాలను, ముఖ్యంగా ప్రేమ - పెళ్లి వంటి కీలక నిర్ణయాలను ఎలా శాసించబోతోందనే అంశంపై మూవీలో చర్చ ఉంటుందని చిత్రబృందం తెలిపింది.
నేటి తరం మనుషుల కంటే ఎక్కువగా తమ చేతిలో ఉన్న ఫోన్లనే నమ్ముతోందని హీరో ప్రదీప్ రంగనాథన్ ఈ వేడుకలో ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ స్టైల్ నుండి ఆరోగ్య సమస్యల వరకు.. చివరకు వ్యక్తిగత రిలేషన్‌షిప్స్ విషయంలో కూడా చాలా మంది చాట్ జీపీటీ వంటి ఏఐ సాధనాలపైనే ఆధారపడుతున్నారని ఆయన గుర్తు చేశారు. 2026లోనే పరిస్థితి ఇలా ఉంటే 2040 నాటికి మనుషుల కంటే మిషన్ల మీద నమ్మకం పూర్తిగా పెరిగిపోయి.. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా ఏఐ చాట్‌బాట్‌లే నిర్ణయించే స్థాయికి చేరుకుంటామేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఈ సినిమా ప్రధానంగా ``ఒక అప్లికేషన్ మనకు సరైన భాగస్వామి ఎవరో చెబితే.. ఆ ప్రేమను మనం మనస్ఫూర్తిగా నమ్మగలమా?`` అనే లోతైన ప్రశ్నను రేకెత్తిస్తుంది. ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం అంతా ఎప్పుడూ సరైనది కాదని.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలు.. వ్యక్తిగత అనుభూతులు ఏఐకి అర్థం కావని ప్రదీప్ స్పష్టం చేశారు. మనిషి భావోద్వేగాలను యంత్రాలు శాసించే స్థితి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయనే పాయింట్‌ను ఈ చిత్రంలో ఎంతో రిలేటబుల్‌గా.. అదే సమయంలో కమర్షియల్ హంగులతో చూపించబోతున్నారు.
సాంకేతికతను కథాంశంతో మేళవించి ఈ చిత్రాన్ని చాలా ఫ్యూచరిస్టిక్‌గా ప్లాన్ చేశామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఎంతో ప్యాషన్‌తో ఈ కథను మలిచారని.. ఆయన పనితీరు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ప్రదీప్ కొనియాడారు. హీరోయిన్ కృతి శెట్టి కూడా ఈ పాత్ర కోసం ఎంతో కష్టపడిందని.. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని నటుడు ఎస్.జె. సూర్య పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన దర్శకుడు అనిల్ రావిపూడి టీమ్‌ను అభినందించడం వారి నమ్మకాన్ని మరింత పెంచింది.
ఒక కొత్త తరహా కథాంశంతో.. నేటి యువత ఆలోచనలకు తగ్గట్టుగా రూపొందిన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. వెండితెరపై ఈ ఏఐ ప్రయోగం ప్రేక్షకులకు ఎటువంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి. నేటి జనరేషన్ కి నచ్చే ఎలిమెంట్ ని తీసుకున్నా.. ఈ సినిమాని దర్శకుడు విఘ్నేష్ ఎంత సరళంగా అర్థమయ్యేలా ట్రీట్ చేసారు? అనేదే విజయాన్ని నిర్ధేశిస్తుంది. చాలా దిగువ స్థాయిలో మాస్ ని కూడా మెప్పించేలా అర్థవంతంగా ఈ సినిమాని రూపొందించారా లేదా? అన్నది పెద్ద తెరపై చూసి నిర్ణయించాలి. అయితే ప్రేమలోని మాధుర్యాన్ని.. సాంకేతికతలోని సౌకర్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని చిత్ర బృందం ధీమాను వ్యక్తం చేస్తోంది. ఎల్.ఐ.కే ప్రీరిలీజ్ కార్యక్రమంలో నయనతార కూడా పాల్గొన్నారు.
