అందరం మళ్లీ ఒక చోట కలుస్తామనుకోలేదు
ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్లు, పెద్దయ్యాక ఎవరికి వారు తమ తమ కెరీర్లో బిజీ అయిపోవడం సహజం.
By: Tupaki Desk | 30 March 2025 11:06 AM ISTఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్లు, పెద్దయ్యాక ఎవరికి వారు తమ తమ కెరీర్లో బిజీ అయిపోవడం సహజం. అయితే చిన్నప్పుడు కలిసి చదువుకున్నట్టే పెద్దయ్యాక అనుకోకుండా అందరూ ఒకే దగ్గరకు చేరుకోవడం ఎంతో థ్రిల్ ను ఇస్తుందని యాంకర్ కం యాక్టర్ ప్రదీప్ మాచిరాజు చెప్తున్నాడు.
ఆర్జేగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన ప్రదీప్ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా మారాడు. యాంకర్ గా ప్రదీప్ టాప్ లీగ్ లోకి వెళ్లాడు. యాంకర్ గా, హోస్ట్ గా పలు షోలను సక్సెస్‌ఫుల్ గా నడిపించిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా తర్వాత కూడా ప్రదీప్ పలు షో లు చేస్తూ వచ్చాడు.
ఇప్పుడు మళ్లీ ప్రదీప్ హీరోగా రెండో సినిమా వస్తోంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ప్రదీప్ మరోసారి తన లక్ ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో నితిన్, భరత్ అనే కొత్త దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో దీపికా పిల్లి ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రదీప్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్ ఇండస్ట్రీలో ఉన్న తన చిన్న నాటి ఫ్రెండ్స్ గురించి మాట్లాడాడు. హీరో నాని, ప్రొడ్యూసర్ నాగ వంశీ, ప్రదీప్ చిన్నప్పుడు ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారట.
చిన్నప్పుడు నాని, వంశీ, తాను కలిసి చదువుకున్నామని, వంశీ- తాను ఒకే కాలనీలో ఉండేవాళ్లమని పెద్దయ్యాక కాలేజీల కోసం ఎవరి దారిలో వాళ్లు వెళ్లామని, మళ్లీ కెరీర్లో అందరం ఒకే దగ్గరకు చేరామని ప్రదీప్ అన్నాడు. తాను రేడియో మిర్చిలో ఆర్జేగా చేస్తున్నప్పుడు నాని కూడా ఓ రేడియో స్టేషన్ లో ఆర్జేగా చేసేవాడని, తర్వాత తాను యాంకర్ గా మారితే నాని హీరోగా మారాడని, నాని తన షోకు వచ్చినప్పుడు కూడా ఇలా కలుస్తామని ఎప్పుడూ అనుకోలేదు కదా, మనం మన ప్రొఫెషన్స్ లో స్టార్లుగా ఉన్నామని అనుకుంటామని నాని చెప్పాడు. నాని హీరోగా సక్సెస్ అయితే, వంశీ నిర్మాతగా సూపర్ సక్సెస్ అయ్యాడని, వాళ్లిద్దరూ కలిసి చేసిన జెర్సీ సినిమా తనకెంతో నచ్చుతుందని, ఆ సినిమా చూశాక తనకు చాలా గర్వంగా అనిపించిందని ప్రదీప్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
