Begin typing your search above and press return to search.

కన్నప్ప.. ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు?

పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కన్నప్ప.

By:  Tupaki Desk   |   15 April 2024 6:45 AM GMT
కన్నప్ప.. ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడు?
X

పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కన్నప్ప. మహా శివుడి పరమ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా ఇప్పటికే న్యూజిలాండ్ లో రెండు కీలక షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్య మహా శివరాత్రి కానుకగా మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. చేతిలో విల్లు పట్టుకుని జలపాతం నుంచి బయటకు వస్తూ విష్ణు ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.

ఇక ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మంచు విష్ణు ఇప్పటికే ధ్రువీకరించగా.. రోల్ వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే ప్రభాస్ మహా శివుడిగా కనిపించనున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఐదు రోజుల కాల్ షీట్స్ ఇచ్చారని తెలిసింది.

అయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించబోతున్నట్లు లేటెస్ట్ టాక్. శివుడి పాత్ర చేయాలని విష్ణు ఒత్తిడి తెచ్చినా.. అందుకు ప్రభాస్ రిజెక్ట్ చేశారట. నందీశ్వరుడు రోల్ కు మాత్రమే ఓకే చెప్పినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. శివుడి పాత్రను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పోషించనున్నారని తాజా సమాచారం.

ఈ సినిమాలో వీరితోపాటు నయనతార, మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, మధుబాల లాంటి ఎందరో స్టార్ నటీనటులు కనిపించనున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి రచయితగా వ్యవహరించిన మంచు విష్ణు.. కన్నప్ప ప్రాజెక్టుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. తన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.