Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 'క‌ల్కి'కి మ‌హాభార‌తం లింక్?

భ‌విష్య‌త్ ప్ర‌పంచాన్ని, అధునాతన రోబోటిక్ టెక్నాల‌జీని ఈ సినిమా క‌థాంశంలో నాగ్ అశ్విన్ చూపించ‌బోతున్నార‌ని ప్ర‌చారం ఉంది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:42 AM GMT
ప్ర‌భాస్ క‌ల్కికి మ‌హాభార‌తం లింక్?
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న 'క‌ల్కి 2898 AD' భార‌త‌దేశంలో నెవ్వ‌ర్ బిఫోర్ విజువ‌ల్ ట్రీట్ ని అందించ‌నుంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. వైజ‌యంతి మూవీస్ అధినేత అశ్వ‌నిద‌త్ ఈ సినిమా కోసం సుమారు 600కోట్ల బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ ఫాంట‌సీ నేప‌థ్యంలో పురాణాల‌ను ట‌చ్ చేస్తూ రూపొందించిన క‌థ‌తో నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు.

ఇందులో మునుపెన్న‌డూ చూడ‌ని ఎన్నో గొప్ప సైంటిఫిక్ ఆవిష్క‌ర‌ణ‌లను ప్ర‌జ‌లు చూడ‌బోతున్నారు. భ‌విష్య‌త్ ప్ర‌పంచాన్ని, అధునాతన రోబోటిక్ టెక్నాల‌జీని ఈ సినిమా క‌థాంశంలో నాగ్ అశ్విన్ చూపించ‌బోతున్నార‌ని ప్ర‌చారం ఉంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ సినిమా కాదు అని అమితాబ్, దీపిక ప‌దుకొనే లాంటి స్టార్లు ఇప్ప‌టికే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. నేరుగా సెట్స్ లో చూసిన దానిని, త‌మ అనుభ‌వాల‌ను ఆ ఇద్ద‌రు దిగ్గ‌జ న‌టులు ఇప్ప‌టికే వెల్ల‌డించారు.

దీంతో ఈ సినిమాపై అంత‌కంత‌కు ఆస‌క్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమా క‌థేమిటో తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది. తాజాగా ఈ సినిమా క‌థాంశం గురించి కీల‌క‌మైన లీక్ అందింది. ఓ ఈవెంట్లో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సినిమా టైటిల్ వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ- "మా సినిమా మహాభారత కాలంలో మొదలై 2898లో ముగుస్తుంది. అదే సినిమా టైటిల్. దీనిని కల్కి 2898AD అంటారు. ఇది కాలక్రమేణా 6000-సంవత్సరాల ప్ర‌యాణాన్ని తెర‌పై ఆవిష్క‌రిస్తుంది" అని తెలిపారు.

మేం కొత్త‌ ప్రపంచాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాము. భారతీయత‌ను చెద‌ర‌కుండా ఈ ప్ర‌పంచాల‌ను నిర్మిస్తున్నాం. దానిని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందున్న‌ సవాల్‌. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం. అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయిన స‌మ‌య‌మ‌ది.. అని తెలిపారు.

నాగ్ అశ్విన్ చెబుతున్న దానిని బ‌ట్టి మ‌హాభార‌తం కాలం నుంచి 6వేల సంవ‌త్స‌రాల పాటు సాగే ఈ క‌థాంశం 2898AD వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు ద‌ర్శ‌కుడి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఉన్న అంచ‌నాల‌ను ఈ మాట‌లు మ‌రింత‌గా పెంచేస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది. 9 మే 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ తేదీ మారుతోంద‌న్న ప్ర‌చారానికి చెక్ పెడుతూ ఇటీవ‌ల చిత్ర‌బృందం మ‌రోసారి క్లారిటీనిచ్చిన సంగ‌తి తెలిసిందే.