Begin typing your search above and press return to search.

ప్రభాస్ బాలీవుడ్ కాంబో.. సమస్య ఏమిటంటే..

కొన్ని నెలల క్రితం ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి

By:  Tupaki Desk   |   25 Jan 2024 12:03 PM GMT
ప్రభాస్ బాలీవుడ్ కాంబో.. సమస్య ఏమిటంటే..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా రూ.700 కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నారు. వేసవి కానుకగా మే9న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రంతోపాటు మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ లో కూడా నటిస్తున్నారు.

కొన్ని నెలల క్రితం ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వీరిద్దరికీ అడ్వాన్స్‌లు కూడా చెల్లించిందని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ గతేడాది రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది.

ఆదిపురుష్ మూవీ తో తీవ్ర విమర్శలపాలు కావడంతో బాలీవుడ్ దర్శకులతో కలిసి పని చేయకూడదనే నిర్ణయానికి ప్రభాస్ వచ్చారని అప్పుడు టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ ఆనంద్ సినిమా నుంచి ప్రభాస్ తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ఎలాంటి చర్చ జరగలేదు.

లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన సిద్ధార్థ్ ఆనంద్ ఇటీవలే హృతిక్ రోష‌న్ హీరోగా ఫైట‌ర్‌ సినిమాను తెరకెక్కించారు. రిపబ్లిక్ డే కానుకగా నేడు రిలీజైన చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంటోంది. సూపర్ సక్సెస్ అయిన పఠాన్ మూవీకి దీటుగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను రూపొందించారని సినీ పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఫైటర్ రిలీజ్ తర్వాత సిద్ధార్థ్- ప్రభాస్ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చింది.

అయితే ఈ ప్రాజెక్ట్ పై నెటిజన్లతోపాటు ఫ్యాన్స్ రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్ ట్రాక్ రికార్డ్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఒక బ్యాచ్.. ఈ సినిమా చేయొద్దని అంటున్నారు. సిద్ధార్థ్ సినిమాలు.. తెలుగు నేటివిటీకి సెట్ అయ్యేలా ఉండవని చెబుతున్నారు. ఒకవేళ ప్రభాస్.. ఆయనతో సినిమా చేస్తే తెలుగులో కన్నా హిందీలో వసూళ్లు బాగుంటాయని అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రభాస్ డైరెక్టర్ల సెలక్షన్ ను చూసుకుంటే.. సిద్ధార్థ్ ఆనంద్ బెటర్ ఆప్షనేనని మరికొందరు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.