డార్లింగ్ సినిమాలపై లేటెస్ట్ అప్డేట్
ఈ రెండు సినిమాలతో పాటూ ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగా కూడా వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే సందీప్ వెయిటింగ్ వేరేగా ఉంది.
By: Tupaki Desk | 14 April 2025 11:38 PM ISTప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ బిజీగా ఉన్న హీరో ఎవరంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరే వినిపిస్తోంది. స్టార్ హీరోలందరూ ఒకసారి ఒక సినిమా చేయడానికే నానా తంటాలు పడుతుంటే ప్రభాస్ మాత్రం ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లి వాటిని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్.
ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు అందరూ క్యూ లు కడుతున్నారు. కానీ ప్రభాస్ డేట్స్ మాత్రం అస్సలు ఖాళీగా లేవు. ఇప్పటికే ప్రభాస్ చేతిలో పలు ప్రాజెక్టులుండగా అవి ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ది రాజా సాబ్ సినిమా ఈ పాటికే థియేటర్లలోకి వచ్చి ఉండేది కానీ గత డిసెంబర్ లో ప్రభాస్ కాలికి గాయం అవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
ఆ బ్రేక్ ప్రభాస్ చేస్తున్న సినిమాలపై పడింది. ఆ బ్రేక్ వల్ల రాజా సాబ్ షూటింగ్ మరింత లేటైంది. ఆ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా ఇంకా పూర్తవకపోవడంతో సినిమా లేటైంది. హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ పరిస్థితి కూడా ఇదే. ఆ టీమ్ కూడా ప్రభాస్ ఎప్పుడెప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తోంది.
ఈ రెండు సినిమాలతో పాటూ ప్రభాస్ కోసం సందీప్ రెడ్డి వంగా కూడా వెయిట్ చేస్తున్నాడు. కాకపోతే సందీప్ వెయిటింగ్ వేరేగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ పూర్తి చేసుకుని తర్వాత కేవలం తనకు మాత్రమే డేట్స్ కేటాయించేలా సందీప్ ఒప్పందం చేసుకున్నాడట. ఒకేసారి, అది కూడా ఎక్కువ మొత్తంలో ప్రభాస్ డేట్స్ ను అడిగాడట సందీప్. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న స్పిరిట్ లేటవుతూ వస్తోంది. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్న సందీప్ ఈ సినిమాలో మమ్ముట్టిని కీలక పాత్రలో తీసుకోనున్నాడని అంటున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ఇవన్నీ చూస్తుంటే రాజాసాబ్, ఫౌజీ సినిమాలు పూర్తైతే కానీ ప్రభాస్, స్పిరిట్ సినిమా కోసం సందీప్ కు డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. స్పిరిట్ సినిమా కూడా పూర్తి చేశాకే ప్రభాస్ కల్కి2 ని సెట్స్ పైకి తీసుకెళ్తాడు. ఈ ఏడాది చివరి నుంచి కల్కి2 ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ కూడా ఈలోపు ఎన్టీఆర్ తో డ్రాగన్ ను పూర్తి చేసి సలార్2 కోసం రెడీ అవుతాడు. ఈ గ్యాప్ లో ప్రభాస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బ్రహ్మ రాక్షస్ అనే సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ సినిమా కోసం ప్రభాస్ కు లుక్ టెస్ట్ కూడా చేశారని, త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
