రాధేశ్యామ్‌ను గుర్తు చేస్తున్న 'రాజాసాబ్'
ప్రభాస్ బాహుబలి, సాహో సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. కెరీర్‌లో కీలకమైన పదేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.
By: Tupaki Desk | 24 April 2025 1:21 PM ISTప్రభాస్ బాహుబలి, సాహో సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. కెరీర్‌లో కీలకమైన పదేళ్లలో ఆయన నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఆయన రాబోయే పదేళ్ల పాటు వరుసగా సినిమాలు చేయాలని, ఏడాదిలో కనీసం రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించాడు. పలు వేదికల మీద ప్రభాస్ మాట్లాడుతూ ఏడాదికి రెండు సినిమాలను తీసుకు వచ్చే విధంగా సినిమాలను కమిట్ అవుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. నా నుంచి సినిమాలు వచ్చేందుకు దర్శకులు సైతం సహకరించాలంటూ ఒక సందర్భంగా ప్రభాస్ అన్నాడు. ఆయన ఆ మాటలు చెప్పి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేయలేక పోతున్నాడు.
ఈ ఏడాదిలో రాజాసాబ్, ఫౌజీ సినిమాలను విడుదల చేయడం ద్వారా తన మాట నిలుపుకుంటాడని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే కనీసం ఒక్క సినిమా అయినా ఈ ఏడాదిలో విడుదల అయ్యేనా అనే అనుమానం కలుగుతోంది. రాజాసాబ్ సినిమాను ఈ నెలలో విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. సమ్మర్ చివర్లో రాజాసాబ్ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కానీ సమ్మర్ చివరి వరకు సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని ఇప్పటికే తేల్చి చెప్పారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కొండంత ఉందని, షూటింగ్ సైతం ఇంకా బ్యాలక్స్ ఉందని సమాచారం అందుతోంది.
మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్ గతంలో నటించిన సాహో, రాధేశ్యామ్ సినిమాలను గుర్తు చేస్తోందని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజాసాబ్ సినిమా ప్రకటించి దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది. ఈ మూడు ఏళ్లుగా ఏం చేస్తున్నట్లు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు మారుతి నుంచి సినిమా అంటే ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చేయలేదని, చాలా స్పీడ్‌గా సినిమా వస్తుందని ఆశించామని అభిమానులు అంటున్నారు. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ మొదలుకుని పలు విషయాల్లో ఆలస్యం.. ఆలస్యం.. ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రభాస్ ఆ సమయంలో ఇతర సినిమాలను కూడా ఏమీ చేయడం లేదు.
రాధేశ్యామ్ సినిమా అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ యూవీ క్రియేషన్స్ వారిని ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. రాధేశ్యామ్ సినిమా టీజర్ విషయం మొదలుకుని ప్రతి విషయంలోనూ యూవీ క్రియేషన్స్ వారు లేట్ చేస్తూ వచ్చారు. అంతగా వెయిట్ చేస్తే సినిమా ఫలితం తీవ్రంగా నిరాశ పరచింది. ఇప్పుడు రాజాసాబ్ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేయించి చివరకు నిరాశ పరుస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోవడంతో రాజాసాబ్, ఫౌజీ సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.
