'ది రాజా సాబ్' లేట్‌కు కారణం అదేనా?
తమన్ సంగీతం అందించిన ఈ మూవీ టీజర్ హారర్ అంశాలతో భయపెడుతూనే నవ్విస్తోంది.
By: Tupaki Desk | 16 Jun 2025 3:31 PM ISTప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `ది రాజా సాబ్`. మారుతి దర్శకుడు. ఇప్పటి వరకు మినిమమ్ బడ్జెట్ సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న మారుతికిది భారీ బడ్జెట్ ఫిల్మ్. అతని కెరీర్‌లో ఓ గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ నటిస్తున్న తొలి కామెడీ హారర్ మూవీ. టీజర్ కోసం గత కొంత కాలంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం టీజర్‌ని మేకర్స్ విడుదల చేయడం తెలిసిందే.
తమన్ సంగీతం అందించిన ఈ మూవీ టీజర్ హారర్ అంశాలతో భయపెడుతూనే నవ్విస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మూవీ ఉంటుందని టీజర్‌తో క్లారిటీ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కొన్ని నెలలుగా ఆలస్యం అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు.
అంతే కాకుండా ఈ మూవీ ఆలస్యం కావడానికి కారణాన్ని కూడా వివరించారు. షూటింగ్ కోసం రెండున్నరేళ్లు పట్టిందన్నారు. గతేడాది మేము కీలక షెడ్యూల్ పూర్తి చేశాం. ఉదయం 6 గంటలకు చిత్రీకరణ ప్రారంభమైతే రాత్రి 11 గంటల వరకు జరిగేది. దాదాపు 120 రోజులకు పైగా ఇదే షెడ్యూల్ కొనసాగింది. ఆ సమయంలోనే క్లైమాక్స్ చిత్రీకరించాం. వీఎఫ్ ఎక్స్ కోసం 300 రోజులు కేటాయించాం. 40 నిమిషాల క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది.
గతేడాది మా బ్యానర్ నుంచి పలు సినిమాలు విడుదలైనప్పటికీ క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఈ సినిమా క్వాలిటీ విషయంలో మేము వెనకడుగు వేయాలనుకోలేదు. ఇది మా బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్. టీజర్‌లో సంజయ్‌దత్ పాత్రకు సంబంధించి గ్లింప్స్ మాత్రమే చూశారు. సినిమాలో ఆయన క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ 3 గంటలు ` అని తెలిపారు. అంటే ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం షూటింగ్‌తో పాటు వీఎఫ్ ఎక్స్ కోసం 300 రోజులు కేటాయించడమేనని స్పష్టమైంది. టీజర్‌లో హారర్ విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. సినిమాలో మరో స్థాయిలో ఉంటాయన్నమాట.
