రాజా సాబ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అంచనాలు పెంచేసిన మారుతి
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ ఒకటి ఇవాళ వచ్చేసింది.
By: Tupaki Desk | 3 Jun 2025 11:36 AM ISTప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ ఒకటి ఇవాళ వచ్చేసింది. అదేంటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చిత్ర నిర్మాతలు ఓ కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. రాజా సాబ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అప్పుడెప్పుడో సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రాజా సాబ్ మేకర్స్ అప్డేట్ ను ఇచ్చారు. జూన్ 16వ తేదీన రాజా సాబ్ టీజర్ రిలీజ్ కానుంది. జూన్ 16న టీజర్ ను రిలీజ్ చేసి, డిసెంబర్ 5న రాజా సాబ్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.
సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ రాజా సాబ్ డైరెక్టర్ మారుతి ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మీ అందరికీ మాటిచ్చినట్టే మీరు కోరుకున్నట్టు ప్రభాస్ ను బిగ్ స్క్రీన్ పై చూస్తారు. ఆ రోజు ఫ్యాన్స్ కు పండగే. ఫ్యాన్స్ లో జోష్ ను నింపేందుకు మరిన్ని అప్డేట్స్ రానున్నాయనే క్యాప్షన్ తో మారుతి ఈ పోస్ట్ ను చేశాడు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న మొదటి సినిమా ఇది.
ఇప్పటికే తమన్ రాజా సాబ్ లో నాలుగు సాంగ్స్ ను పూర్తి చేయగా, ఆ పాటలన్నీ వైవిధ్యమైన థీమ్స్ తో డిజైన్ చేసినట్టు మారుతి తెలిపాడు. ఆ నాలుగు పాటల్లో మెలోడీస్ తో పాటూ మాస్ తో డ్యాన్స్ చేయించే సాంగ్ కూడా ఉందని చెప్పడంతో రాజా సాబ్ పై ఒక్కసారిగా అంచనాలు తారాస్థాయికి చేరాయి. హార్రర్ కామెడీ నేపథ్యంలో ప్రభాస్ మొదటిసారి చేస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి రాజా సాబ్ పైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
