'స్పిరిట్' సైడ్ అయ్యే ఛాన్సే లేదు..!
స్పిరిట్ సినిమాను ఈ సమ్మర్ నుంచి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది.
By: Tupaki Desk | 18 April 2025 3:00 AM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో పాటు సమాంతరంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను రూపొందిస్తున్నారు. ఫౌజీ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సమ్మర్‌లో రాజాసాబ్ విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. రాజాసాబ్ ఆలస్యం అయితే ఫౌజీ సినిమా ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు ఏది తర్వాత అనే విషయం పక్కన పెడితే ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్ సినిమాను ప్రభాస్ చేయబోతున్నాడు.
అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా 'స్పిరిట్'. దాంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. స్పిరిట్ సినిమాను ఈ సమ్మర్ నుంచి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతుంది. గత ఏడాది నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఒక వైపు సినిమాకు సంబంధించిన వర్క్ చకచకా జరుగుతూ ఉంటే సోషల్ మీడియాలో మాత్రం స్పిరిట్ సినిమాను పక్కకు పెట్టారు. ఆ సినిమాను మళ్లీ ఎప్పుడైనా చేయాలని నిర్ణయించుకున్నారని, సందీప్ రెడ్డి వంగ మరో హీరోతో సినిమాకు రెడీ అవుతూ ఉండగా, ప్రభాస్ తదుపరి సినిమాను ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి.
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో సినిమా సైడ్ అయిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం లొకేషన్స్ ఎంపిక జరుగుతుందని, షూటింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభంకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కానీ కచ్చితంగా సినిమాను ఆలస్యంగా అయినా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్‌ను రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో చూడబోతున్నామనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలతో పోల్చితే స్పిరిట్ సినిమా హింస ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.
యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ సినిమా అనగానే అన్ని భాషల్లోనూ అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్, సందీప్ కాంబో మూవీ అంటే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అందుకే ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సైడ్ చేసే అవకాశం లేదు. ముందు ముందు కాస్త ఆలస్యం అయినా సినిమాను పట్టాలెక్కించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే సినిమాను పట్టాలెక్కించి, వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
