Begin typing your search above and press return to search.

'స్పిరిట్‌' కోసం ఇంకాస్త వెయిటింగ్‌ తప్పదు

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో 'స్పిరిట్‌' సినిమాను ప్రకటించి రెండేళ్లకు పైగానే అయింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు.

By:  Tupaki Desk   |   13 April 2025 9:00 PM IST
స్పిరిట్‌ కోసం ఇంకాస్త వెయిటింగ్‌ తప్పదు
X

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో 'స్పిరిట్‌' సినిమాను ప్రకటించి రెండేళ్లకు పైగానే అయింది. ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. గత ఏడాది నుంచి స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతుందని, డైలాగ్‌ వర్షన్ స్క్రిప్ట్‌ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్‌' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీతో పాటు సౌత్‌ ఇండియాలోనూ యానిమల్‌ సినిమాకు మంచి వసూళ్లు వచ్చిన విషయం తెల్సిందే. అందుకే అన్ని భాషల ప్రేక్షకులు కూడా ప్రభాస్‌తో సందీప్ వంగ తెరకెక్కించబోతున్న 'స్పిరిట్‌' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉన్నా ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇటీవల దర్శకుడు సందీప్ వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూన్‌ లేదా జులై నెలల్లో సినిమాను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 'స్పిరిట్‌' సినిమాను ఇదే ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుంచి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ప్రభాస్ ఫిజికల్‌గా రెడీ అవ్వాల్సి ఉందట. అందుకే షూటింగ్ ప్రారంభంకు కాస్త సమయం కావాలని అడిగారని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్పిరిట్‌ సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడని, అందుకే షూటింగ్‌కు ముందు కనీసం కొన్ని నెలలు ప్రిపరేషన్‌ జరగాలని అనుకుంటున్నారు.

యానిమల్ సినిమాను చూసిన ప్రేక్షకులు ప్రభాస్‌ను స్పిరిట్‌ సినిమాలో ఎలా చూడబోతున్నామా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పోలీస్‌ స్టోరీతో స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు సందీప్ వంగ ఆఫ్ ది రికార్డ్‌ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయితేనే స్పిరిట్ సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉంటాయి అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ప్రస్తుతం చేస్తున్న సినిమాల కంటే ప్రభాస్‌ ఇంకా మొదలు పెట్టని స్పిరిట్‌ సినిమాపైనే అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అనడంలో సందేహం లేదు.

అర్జున్‌ రెడ్డితో మొదలైన సందీప్ రెడ్డి వంగ సినీ ప్రస్థానం తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ నుంచి అన్ని వుడ్స్‌లోనూ హై కి చేరింది. సందీప్ వంగ వంటి దర్శకుడు పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో సినిమా తీస్తే అది మినిమం వెయ్యి కోట్ల సినిమాగా నిలవడం ఖాయం. అందుకే ప్రభాస్‌, సందీప్ రెడ్డి వంగ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా ఈ సినిమాను విదేశీ భాషల్లో కూడా విడుదల చేస్తామని యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. కనుక ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు చేసినా ఆశ్చర్యం లేదు. పాన్ ఇండియా రేంజ్‌లో వీరిద్దరికి ఉన్న క్రేజ్ కారణంగా రికార్డ్‌ బ్రేకింగ్‌ ఓపెనింగ్స్ ఖాయం. ఆలస్యంగా మొదలు అయినా 2026లో స్పిరిట్‌ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.