Begin typing your search above and press return to search.

ఫైనల్లీ... 'స్పిరిట్‌' మొదలయ్యేది ఎప్పుడంటే!

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగ కాంబో మూవీ ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. సందీప్ రెడ్డి వంగ తన 'యానిమల్‌' సినిమాతో రాకముందే స్పిరిట్‌ సినిమాను మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   5 July 2025 11:36 AM IST
ఫైనల్లీ... స్పిరిట్‌ మొదలయ్యేది ఎప్పుడంటే!
X

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, సందీప్‌ రెడ్డి వంగ కాంబో మూవీ ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. సందీప్ రెడ్డి వంగ తన 'యానిమల్‌' సినిమాతో రాకముందే స్పిరిట్‌ సినిమాను మొదలు పెట్టారు. యానిమల్‌ సినిమా వచ్చి ఏడాదిన్నర దాటింది. ఇప్పటి వరకు స్పిరిట్‌ సినిమాను మొదలు పెట్టలేదు. యానిమల్‌ సినిమా ప్రమోషన్‌ సమయంలో స్పిరిట్‌ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిందని, డైలాగ్‌ వర్షన్‌ మాత్రమే చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. 2024 ద్వితీయార్థంలో సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తాను అంటూ ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు సినిమా ప్రారంభం కాలేదు. ఏడాది కాలంగా దర్శకుడు ఆలస్యం చేస్తున్నాడా లేదంటే ప్రభాస్ వల్ల ఆలస్యం అవుతుందా అర్థం కావడం లేదు.

సందీప్ రెడ్డి వంగ గత ఏడాది కాలంగా ఈ సినిమా గురించి మీడియాలో ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూనే ఉన్నాడు. ఇండియన్ భాషల్లోనే కాకుండా విదేశీ భాషల్లోనూ విడుదల చేసే విధంగా ఈ సినిమా కంటెంట్‌ ఉంటుంది అంటూ దర్శకుడు సందీప్‌ రెడ్డి అనౌన్స్‌మెంట్‌ సమయంలోనే ప్రకటించిన విషయం తెల్సిందే. అందుకే ప్రభాస్‌ అభిమానుల్లోనే కాకుండా పాన్‌ ఇండియా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తారా అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్పిరిట్‌ సినిమా షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాకపోవడంతో చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేస్తూ సందీప్‌ రెడ్డి వంగపై నెగటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు.

స్పిరిట్‌ సినిమాలో మొదట హీరోయిన్‌గా దీపికా పదుకునేను ఎంపిక చేయడం జరిగింది. కానీ పారితోషికం ఇష్యూ కారణంగా ఆమెను తప్పించి యానిమల్‌ ఫేం తృప్తి డిమ్రి ను ఎంపిక చేయడం జరిగింది. ఆ సమయంలో సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. మళ్లీ ఇప్పుడు స్పిరిట్‌ గురించి చర్చ జరుగుతోంది. స్పిరిట్‌ సినిమా గురించి తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అధికారికంగా స్పందించాడు. సినిమా షూటింగ్విషయమై ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత బ్రేక్‌ లు లేకుండా షూటింగ్‌ను ఏకధాటిగా చేసే అవకాశాలు ఉన్నాయి.

2025 సెప్టెంబర్‌లో సినిమాను ప్రారంభిస్తే ఖచ్చితంగా 2027లో విడుదల ప్లాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. స్పిరిట్‌లో ప్రభాస్ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. స్పిరిట్ సినిమా షూటింగ్‌ కోసం ప్రభాస్ సైతం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ వరకు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్‌', హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా స్పిరిట్‌ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశాలు ఉంటాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్ల మూవీ అంటూ ఫ్యాన్స్‌తో పాటు బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా సెప్టెంబర్‌ నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా దర్శకుడు సందీప్‌ వంగ ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.