Begin typing your search above and press return to search.

'సలార్‌' మళ్లీ నెం.1... ఇదే సాక్ష్యం

ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన 'సలార్‌' సినిమా 2023 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   28 May 2025 10:18 AM
సలార్‌ మళ్లీ నెం.1... ఇదే సాక్ష్యం
X

ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన 'సలార్‌' సినిమా 2023 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేజీఎఫ్ సినిమా సూపర్‌ హిట్‌ నేపథ్యంలో సలార్‌ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్‌ సినిమాను భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రశాంత్‌ నీల్‌ రూపొందించాడు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని భాషల్లోనూ యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను తెగ ఆధరించారు. దాంతో థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యి దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టగా, ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎన్నో రికార్డ్‌లను ఈ సినిమా దక్కించుకుని అరుదైన సినిమాగా నిలిచింది.

సాధారణంగా అన్ని సినిమాలు ఒకటి లేదా రెండు ఓటీటీల్లో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా ఏకంగా ఏడు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌లో స్ట్రీమింగ్‌ అయింది. థియేట్రికల్‌ రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలు పెట్టిన సలార్‌ అన్ని భాషల్లోనూ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ ఎక్కువగా ఆన్‌డ్రాయిడ్‌ టీవీల్లో వాడుతూ ఉన్నారు. మొబైల్‌లో ఓటీటీలను వినియోగించడం కాస్త తక్కువే అని చెప్పాలి. అయితే సలార్‌ సినిమా మొబైల్ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా చూడబడిన సినిమాగా నిలిచింది అంటూ నిల్సన్‌ అనే సంస్థ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, జియో హాట్‌ స్టార్‌, సోనీ లివ్‌, జీ5, ఎంఎక్స్ ప్లేయర్‌ ఇలా పలు భాషల్లో వివిధ భాషల్లో సలార్‌ అందుబాటులో ఉంది. లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్కులు మొబైల్ ద్వారా సలార్‌ సినిమాను చూసినట్లుగా నిల్సన్‌ సర్వేలో వెళ్లడి అయింది. మొబైల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ల్లో ఎక్కువగా వెబ్‌ సిరీస్‌లను చూస్తూ ఉంటారని, ఆ తర్వాత ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌లను చూస్తూ ఉంటారు. కానీ మార్చి 2025 లెక్కల ప్రకారం సలార్‌ సినిమాను మొబైల్‌ స్క్రీన్‌ పై అత్యధికులు చూశారని వెళ్లడి అయింది. ప్రభాస్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రముఖంగా షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు.

సలార్‌ సినిమా పార్ట్‌ 1 లో మిగిలి ఉన్న ప్రశ్నలకు పార్ట్‌ 2 లో సమాధానం చెప్పాల్సి ఉంది. ఎన్నో ప్రశ్నాలకు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ 2 లో సమాధానం ఇస్తాడని అభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో ప్రభాస్, ప్రశాంత్‌ నీల్‌ కాంబో 'సలార్‌ 2' ఎప్పుడు మళ్లీ సెట్స్ పైకి వెళ్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెజార్టీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసి ఉంటాడని కొందరు అంటూ ఉంటే, సలార్‌ 2 సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదని కొందరు అంటున్నారు. మొత్తానికి సలార్‌ విడుదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నా వార్తల్లో నిలుస్తూనే ఉంది.