Begin typing your search above and press return to search.

రాజాసాబ్‌... ప్రభాస్‌కే ఎందుకు ఇలా జరుగుతుంది?

'బాహుబలి', 'సాహో', 'రాధేశ్యామ్‌' సినిమాల కోసం చాలా ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్ తదుపరి సినిమాలను చాలా స్పీడ్‌గా చేయాలని అనుకున్నాడు. అందుకోసం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలకు కమిట్‌ అయ్యాడు.

By:  Tupaki Desk   |   26 May 2025 7:38 AM
రాజాసాబ్‌... ప్రభాస్‌కే ఎందుకు ఇలా జరుగుతుంది?
X

'బాహుబలి', 'సాహో', 'రాధేశ్యామ్‌' సినిమాల కోసం చాలా ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్ తదుపరి సినిమాలను చాలా స్పీడ్‌గా చేయాలని అనుకున్నాడు. అందుకోసం బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ఏడాదికి రెండు, వీలుంటే మూడు సినిమాలను విడుదల చేయాలని ఆశ పడ్డాడు. అభిమానులతో చాలా సార్లు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తాను అంటూ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. కానీ దర్శకులు అందుకు సహకరించాలని అన్నాడు. అన్నట్లుగానే ఆయనకు దర్శకుల నుంచి సహకారం అందడం లేదు. రాజాసాబ్‌ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాలేదు.

ఆ మధ్య 'రాజాసాబ్‌' సినిమాను ఏప్రిల్‌లో కచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ బలంగా చెబుతూ వచ్చారు. కానీ సినిమా షూటింగ్‌తో పాటు, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ కూడా పూర్తి కాలేదు. దాంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్‌లో మిస్‌ అయినా సమ్మర్‌ చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ ఏడాది చివరికి సినిమాను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2025 డిసెంబర్‌కి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ సినిమా యొక్క వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందున సినిమా వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఫౌజీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను స్పీడ్‌గా షూటింగ్‌ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజాసాబ్‌ సినిమా మాత్రం 2025 డిసెంబర్‌లో కూడా వచ్చే వరకు అనుమానమే అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్‌ను కాపాడుకుంటూ అనుకున్న సమయంకు విడుదల చేసి ఉంటే కచ్చితంగా రాజాసాబ్‌ సినిమా ఫలితం మరో రేంజ్‌లో ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

పాపం ప్రభాస్‌ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా, ప్రేక్షకుల ముందుకు ఏడాదికి రెండు మూడు సినిమాలను తీసుకు రావాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదు. ఇతర హీరోలు మెల్లగా సినిమాలు చేస్తూ ఏడాదికి ఒకటి లేదా రెండేళ్లకు ఒకటి సినిమాను చేస్తున్నారు. కానీ ప్రభాస్‌ మాత్రం ఒకే సారి రెండు మూడు సినిమాలు చేస్తున్నా కూడా ఏదో ఒక సమస్య కారణంగా ఆలస్యం అవుతోంది. సలార్‌ 2, కల్కి 2 సినిమాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. రాజాసాబ్‌ సినిమాతో పాటు ఫౌజీ సినిమా ఈ ఏడాదిలో వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. దాంతో ప్రభాస్‌కే ఎందుకు ఇలా జరుగుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.