Begin typing your search above and press return to search.

'రాజా సాబ్' రన్ టైమ్.. ఇది కొంచెం రిస్క్ అనిపించట్లేదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న 'రాజా సాబ్' సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   3 Dec 2025 4:00 AM IST
రాజా సాబ్ రన్ టైమ్.. ఇది కొంచెం రిస్క్ అనిపించట్లేదా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే భారీతనానికి కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న 'రాజా సాబ్' సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. హార్రర్ కామెడీ జానర్ లో ప్రభాస్ ను చూడబోతున్నామనే ఆసక్తి ఫ్యాన్స్ లో ఉంది. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండగానే, ఇప్పుడు దీని రన్ టైమ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ నెంబర్ చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే, మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా హార్రర్ కామెడీ సినిమాలు ఎంత క్రిస్ప్ గా ఉంటే అంత మంచిది. రెండు నుంచి రెండున్నర గంటల లోపు ఉంటేనే ఆ కిక్ ఉంటుంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం 'రాజా సాబ్' రన్ టైమ్ ఏకంగా 3 గంటల 15 నిమిషాలు ఉంటుందని బజ్ నడుస్తోంది. ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకు ఇంత నిడివి అవసరమా అనే చర్చ మొదలైంది. ఇది నిజంగానే కొంచెం రిస్క్ అనిపించట్లేదా అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో 'అర్జున్ రెడ్డి', 'ఆర్ఆర్ఆర్', రీసెంట్ గా 'యానిమల్' వంటి సినిమాలు మూడు గంటలకు పైగా ఉన్నా ఆడియెన్స్ ఆదరించారు. కానీ అవన్నీ ఎమోషనల్ ఉన్న డ్రామాలు లేదా భారీ యాక్షన్ సినిమాలు. కామెడీ ప్లస్ హరర్ జానర్ లో మూడుంబావు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎక్కడ ఏ మాత్రం ల్యాగ్ వచ్చినా ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉంది. దర్శకుడు మారుతి ఈ ఛాలెంజ్ ను ఎలా స్వీకరిస్తారో చూడాలి.

అయితే ఈ నిడివి వెనుక మరో కారణం కూడా ఉండొచ్చు. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్స్, ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల లెంగ్త్ పెరిగి ఉండవచ్చు. లేదా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, పాటలు రన్ టైమ్ ను పెంచి ఉండొచ్చు. కథ డిమాండ్ మేరకే ఇంత సమయం తీసుకున్నారని, ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకా మార్పులు జరిగే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.

మరోవైపు అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ అప్పుడే మొదలయ్యాయి. సాధారణంగా రన్ టైమ్ ఎక్కువ ఉంటే రోజుకు పడే షోల సంఖ్య తగ్గుతుంది. ఇది ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు ఇంత ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేశారంటే, సినిమా అవుట్ పుట్ మీద వారికి గట్టి నమ్మకమే ఉండి ఉంటుంది.

ప్రస్తుతానికి ఇది కేవలం అనుకుంటున్న రన్ టైమ్ మాత్రమే. సెన్సార్ పూర్తి అయ్యేసరికి ఫైనల్ కట్ లో చాలా మార్పులు ఉండొచ్చు. మూడు గంటల సినిమానా లేక ట్రిమ్ చేస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా 'రాజా సాబ్' నిడివి విషయం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.