Begin typing your search above and press return to search.

ప్రభాస్‌తో సినిమా.. మారుతి నో చెబుదామనుకుని!

ఒక సమయంలో తనకు కూడా ఈ సినిమా చేయాలా వద్దా అని అనుమానం కలిగి.. ప్రభాస్‌తో సినిమా వద్దులే అనుకున్నట్లు మారుతి చెప్పడం విశేషం.

By:  Tupaki Desk   |   16 Jun 2025 3:29 PM IST
ప్రభాస్‌తో సినిమా.. మారుతి నో చెబుదామనుకుని!
X

ప్రభాస్.. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్. ఇండియాలో అతనే నంబర్ వన్ హీరో అంటే అతిశయోక్తి కాదు. అలాంటి హీరోతో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసుకునే మారుతి కాంబినేషన్ అనేసరికి అభిమానులు తట్టుకోలేకపోయారు. అందులోనూ మారుతి చివరి చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులు వచ్చాయి డిజాస్టర్లు కావడంతో అభిమానుల్లో మరింత నెగెటివిటీ నెలకొంది. ఈ కాంబినేషన్లో సినిమా వద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద గొడవ చేయడం గుర్తుండే ఉంటుంది.

దీని గురించి ‘రాజా సాబ్’ టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు మారుతి స్పందించడం విశేషం. తనతో సినిమా వద్దని ప్రభాస్‌కు చాలామంది చెప్పారని.. అభిమానులు చేసిన గొడవ గురించి కూడా తనకు గుర్తు ఉందని అతనన్నాడు. ఒక సమయంలో తనకు కూడా ఈ సినిమా చేయాలా వద్దా అని అనుమానం కలిగి.. ప్రభాస్‌తో సినిమా వద్దులే అనుకున్నట్లు మారుతి చెప్పడం విశేషం.

నిజానికి ముందు ప్రభాస్, మారుతి కాంబినేషన్లో చేయాలనుకున్నది నిర్మాత డీవీవీ దానయ్య. ఐతే ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్ కావడంతో ఆయన ఈ సినిమాను వదులుకున్నారు. దానయ్య పేరెత్తకుండా మారుతి ఈ విషయాన్ని టీజర్ లాంచ్ ఈవెంట్లో ప్రస్తావించారు. తమ కాంబినేషన్లో సినిమా చేయాలనుకున్న నిర్మాత ఈ ప్రాజెక్టు వద్దని వెనక్కి తగ్గినపుడు తన ఆలోచన కూడా మారిపోయిందన్నాడు. ఫ్యాన్స్ కూడా తనతో ప్రభాస్ సినిమా వద్దని అంటుండడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేద్దామనుకున్నట్లు మారుతి చెప్పాడు.

ఈ మేరకు ప్రభాస్‌కు మెసేజ్ పెట్టేద్దాం అనుకున్నానని.. అదే విషయాన్ని ప్రభాస్ ఫ్రెండయిన ‘యువి’ వంశీకి కూడా చెప్పానని.. ఐతే అదే రోజు రాత్రి ప్రభాస్ తనకు ఫోన్ చేసి తాను చెప్పిన కథలో ఇది బాగుంది, అది బాగుంది అని మాట్లాడాడని.. ఈయనకు మన మీద ఇంత నమ్మకమేంటి అని తాను ఆశ్చర్యపోాయానని మారుతి తెలిపాడు. ప్రభాస్ తనను అంత నమ్ముతున్నపుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాని.. ఏదైనా మనం చేయలేం అని వెనక్కి తగ్గితే చచ్చినట్లే లెక్క అని.. ఇందుకు కాదు కదా మనం హైదరాబాద్ వచ్చింది అనుకుని.. పట్టుదలతో ‘రాజా సాబ్’ స్క్రిప్టు రాయడం మొదలుపెట్టానని.. దాని ఫలితమే ఇప్పుడు టీజర్లో చూస్తున్న కంటెంట్ అని మారుతి తెలిపాడు. చాలామంది ప్రభాస్‌ను మారుతితో సినిమా వద్దని వారించారని.. కానీ ఆయన మాత్రం మీరెవ్వరూ చూడనిది నేను అతడిలో ఒకటి చూశాను.. నాకు నమ్మకం ఉంది అంటూ బ్లైండ్‌గా ఈ సినిమా చేశాడని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మారుతి ధీమా వ్యక్తం చేశాడు.