Begin typing your search above and press return to search.

'ప్రభాస్ గారు.. ఫిష్ వెంకట్ భార్యకు ఆ రూ.50 లక్షలు ఇవ్వండి'

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఫిష్ వెంకట్.. ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2025 9:33 AM IST
ప్రభాస్ గారు.. ఫిష్ వెంకట్ భార్యకు ఆ రూ.50 లక్షలు ఇవ్వండి
X

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఫిష్ వెంకట్.. ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో ఇండస్ట్రీతోపాటు ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది.

ఆ తర్వాత శనివారం ఫిష్ వెంకట్ అంత్యక్రియలు హైదరాబాద్ లోని మారేడ్‌ పల్లి హిందూ శ్మశానవాటికలో జరిగాయి. తొలుత భౌతికకాయాన్ని సికింద్రాబాద్‌ లోని అడ్డగుట్టలో ఉన్న ఆయన నివాసం వద్ద ఉంచారు. అభిమానుల సందర్శన అనంతరం శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిపి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.

అయితే ఫిష్ వెంకట్ కు గబ్బర్ సింగ్ టీమ్ కన్నీటి వీడ్కోలు పలికింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలోని పోలీస్ స్టేషన్ సీన్ లో ఫిష్ వెంకట్ ఓ రేంజ్ లో అలరించిన విషయం తెలిసిందే. సినిమాలోని ఆ సీన్ లో ఆయనతో కనిపించిన టీమ్ అంతా.. అంత్యక్రియలకు హజరైంది. అప్పుడు మీడియాతో మాట్లాడింది.

"ప్రభాస్ గారు రూ.50 లక్షలు ఇస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు మా వదినమ్మ(ఫిష్ వెంకట్ సతీమణి)కి ఇవ్వండి. అప్పుడు ఆమె చక్కగా బతుకుతూ.. పిల్లలను చూసుకుంటుంది. ఏ ఏ హీరోలతో మా అన్న ఫిష్ వెంకట్ వర్క్ చేశారో.. వాళ్లంతా ఇప్పుడు సాయం చేయాలని కోరుకుంటున్నాం" అని గబ్బర్ సింగ్ టీమ్ తెలిపింది.

"మా వదినమ్మకు ఇప్పుడు ఎలాంటి ఆదాయం లేదు. అందుకే సాయం చేయండి. ఇప్పటి వరకు కొందరు ఇచ్చిన డబ్బులంతా హస్పిటల్ ఖర్చులకు అయిపోయాయి. అందుకే దండం పెడుతున్నాం. సాయం చేయండి. ప్రభాస్ గారు ఇస్తారని ప్రచారం జరిగిన డబ్బులు.. ఇప్పుడు ఆయన గుర్తుగా వదినకు ఇవ్వండి ప్లీజ్" అని రిక్వెస్ట్ చేసింది.

ఇటీవల ఫిష్ వెంకట్ కుటుంబానికి ప్రభాస్ రూ. 50 లక్షల ఆర్థిక సహాయం చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వెంకట్ ఫ్యామిలీ అదేం లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ టీమ్ కు కాల్ చేశామని, సార్‌ తో మాట్లాడి చెబుతామని అన్నారని తెలిపింది. ఆ తర్వాత స్పందన రాలేదని, ప్రభాస్‌ కు ఆ విషయం తెలియదేమోనని అభిప్రాయపడింది. ఇప్పుడు ఆ రూ.50 లక్షలు వెంకట్ భార్యకు ఇవ్వాలని గబ్బర్ సింగ్ టీమ్ కోరుతుంది.