సీనియర్లకు డార్లింగ్ లైన్ క్లియర్ చేసినట్లే!
తెలుగు పరిశ్రమకు సంక్రాంతి అనేది అత్యంత లాభదాయకమైన సీజన్. ఈ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర సీనియర్ హీరోల సినిమాలు విడుదల కావడం ఆనవాయితీగా వస్తోంది.
By: Tupaki Desk | 17 Sept 2026 8:13 AM ISTటాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండుగ సీజన్ వచ్చిందంటే? బడా హీరోల సినిమాల విడుదల తేదీల పోటీ ఊపందుకుంటుంది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో దిగేందుకు హీరోలంతా ఆసక్తి చూపిస్తారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం `ఫౌజీ` విడుదలపై ఫిలింనగర్ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి రేసులో కాకుండా జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం సమాయత్తమవుతోందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయంతో సీనియర్ హీరోలకు సంక్రాంతి లైన్ క్లియర్ అయినట్లేనని చెప్పొచ్చు.
పరిశ్రమలో సీనియర్ నటులపట్ల గౌరవం, మర్యాదలు ప్రదర్శించడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన్ని అంతా ఆప్యాయంగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. గతంలో కూడా పలు సందర్భాల్లో సీనియర్ హీరోల సినిమాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన చిత్రాల విడుదల తేదీలను సర్దుబాటు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. సీనియర్ల పట్ల తనకున్న అభిమానాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లోనూ చూపుతానని ప్రభాస్ మరోసారి నిరూపిస్తున్నారు. పోటీ వాతావరణాన్ని నివారించి అందరి సినిమాలకూ మంచి థియేటర్లు లభించాలనే ఆలోచనతో డార్లింగ్ తీసుకుంటున్న నిర్ణయం పరిశ్రమలో ప్రశంసలు అందుకుంటోంది.
తెలుగు పరిశ్రమకు సంక్రాంతి అనేది అత్యంత లాభదాయకమైన సీజన్. ఈ సమయంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర సీనియర్ హీరోల సినిమాలు విడుదల కావడం ఆనవాయితీగా వస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ లాంటి భారీ పాన్ ఇండియా స్టార్ సినిమా సంక్రాంతి బరిలో ఉంటే థియేటర్ల కేటాయింపు, కలెక్షన్ల విభజన విషయంలో తీవ్ర పోటీ నెలకొంటుంది. `ఫౌజీ` వంటి భారీ ప్రాజెక్ట్ పండుగ రేసు నుంచి ఎగ్జిట్ అయి జనవరి 26కు షిఫ్ట్ అవ్వడం వల్ల సీనియర్ హీరోల సినిమాలకు కావాల్సినంత స్పేస్ లభించడమే కాకుండా వసూళ్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇదే సీజన్ లో యంగ్ హీరోల సినిమాలు కూడా పరిమితంగా రిలీజ్ అవుతంఆయి. వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సీనియర్ హీరోల సినిమాలకు టికెట్ దొరకని అభిమానులు చిన్న సినిమాలను ఆదరించే అవకాశం ఉంటుంది. కంటెంట్ బాగుంటే గనుక సీనియర్లను మంచిని విజయాలు చిన్న సినిమాలు సాధిస్తోన్న సంగతి తెలిసిందే.
`ఫౌజీ` చిత్ర కథాంశం దేశభక్తి నేపథ్యంతో కూడుకున్నదనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు జనవరి 26 (రిపబ్లిక్ డే) వీకెండ్ సరైన వేదికగా నిలుస్తుందని చెప్పొచ్చు. పండుగ హడావుడి ముగిసిన వెంటనే సోలో రిలీజ్ అడ్వాంటేజ్ సాధించడానికి ఈ ప్లాన్ ఉపకరిస్తుంది. కథకు సరిపోయే సరైన తేదీని ఎంచుకోవడంతో పాటు పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవడం డార్లింగ్ వ్యక్తిత్వానికి నిదర్శనం.
