ఎండలు మండుతోన్న వెనక్కి తగ్గని ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి నమోదవుతున్నాయి.
By: Srikanth Kontham | 14 April 2026 2:50 PM ISTప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి నమోదవుతున్నాయి. అయినా టాలీవుడ్ అగ్ర హీరోలు ఏమాత్రం తగ్గడం లేదు. తమ సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ప్రకటించిన సమయానికే తమ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే పట్టుదలతో ఎండలను సైతం లెక్కచేయకుండా షూటింగ్‌లలో నిమగ్నమవుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో షెడ్యూల్స్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణను కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీ భారీ ప్రాజెక్టులకు అడ్డాగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పీరియాడిక్ డ్రామా `ఫౌజీ` షూటింగ్ అక్కడే శరవేగంగా జరుగుతోంది. యుద్ధం దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం భారీ సెట్లను రూపొందించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా? ప్రభాస్ , చిత్ర యూనిట్ నిరంతరం శ్రమిస్తూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ వృత్తి పట్ల చూపిస్తున్న అంకితభావాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు అదే ఫిలిం సిటీలో సూపర్ స్టార్ మహేష్ - దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేష న్‌లో తెరకెక్కుతోన్న`వారణాసి` పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
ఇది గ్లోబల్ అడ్వెంచర్ మూవీ కావడంతో ప్రతి సీన్ అత్యంత ఖచ్చితత్వంతో ఉండాలని రాజమౌళి కష్ట పడుతున్నారు. మహేష్ కూడా తన లుక్ , ఫిజికల్ ట్రైనింగ్‌తో సిద్ధమై షూటింగ్‌లో పాల్గొంటున్నారు. స్పాట్ లో ఎండల వల్ల షూటింగ్‌కు ఆటంకం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సమయంలో డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారని తెలిసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా షూటింగ్ దశలో ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ - భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఫిలిం సిటీ ఎండల్లోనే తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్‌ను దాటి ముంబైలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన హవా చాటుతున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకె క్కుతున్న `AA 22` షూటింగ్ ముంబై పరిసరాల్లో కొనసాగుతోంది. `పుష్ప-2` తర్వాత బన్నీ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముంబై ఎండలను సైతం లెక్కచేయకుండా అల్లు అర్జున్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇంకా మరికొంత మంది హీరోల షూటింగ్ ఆర్ ఎఫ్ సీలోనే జరుగుతోంది. ఇలా టాలీవుడ్ టాప్ హీరోలందరూ భానుడి భగ భగల్ని సైతం లెక్క చేయకుండా సినిమాలను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు
