Begin typing your search above and press return to search.

కల్కి పార్ట్ 2: అసలేం జరుగుతోంది?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే.

By:  M Prashanth   |   20 Feb 2026 4:46 PM IST
కల్కి పార్ట్ 2: అసలేం జరుగుతోంది?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు అందరి కళ్లు సీక్వెల్ మీద పడ్డాయి. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి లేటెస్ట్ గా ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. కల్కి పార్ట్ 2 షూటింగ్ ఈ నెల చివర్లో అంటే ఫిబ్రవరి 20 నుండే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

ఈ క్రేజీ సీక్వెల్ కోసం మేకర్స్ పక్కా ప్లానింగ్‌తో రెడీ అయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మొదట అశ్వత్థామకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్ సిద్ధమైంది. బిగ్ బీ పాత్ర ఈ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్‌గా, ఎక్కువ స్క్రీన్ టైమ్‌తో ఉండబోతోందని టాక్. ఈ లెజెండరీ యాక్టర్‌తో పాటు కమల్ హాసన్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇక ప్రభాస్ విషయానికి వస్తే, ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ వంటి సినిమాలతో బిజీగా ఉన్నా కల్కి 2 కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించారు. మొదట ప్లాన్ చేసిన రెండు వారాల షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఆ తర్వాతే ఇతర సినిమాల సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రభాస్ కి రీసెంట్ గా చిన్న గాయమైనా కూడా సినిమా మీద ఉన్న కమిట్‌మెంట్ తో షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ప్రభాస్ కూడా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొదటి భాగంలో సుమతిగా నటించిన దీపికా పదుకొనే స్థానంలో సాయి పల్లవి రాబోతోందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మేకర్స్ సాయి పల్లవిని ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ విషయంలో ఇంకా మేకర్స్ నుండి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.

నాగ్ అశ్విన్ ఈసారి కల్కి ప్రపంచాన్ని మరింత కొత్తగా చూపించడానికి రెడీ అయ్యారు. కొత్త ప్రాంతంతో పాటు మరికొన్ని వింత తెగలను కూడా ఈ సీక్వెల్‌లో పరిచయం చేయబోతున్నారట. మొదటి భాగం కంటే విజువల్స్, ఎమోషన్స్ పరంగా ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక భారీ సెట్ ని కూడా హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేశారు.

బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే సినిమా కావడంతో, సీక్వెల్‌పై బిజినెస్ పరంగా కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టును 2027 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో సినిమాపై ఉన్న బజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈసారి నాగ్ అశ్విన్ ప్రభాస్ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.