Begin typing your search above and press return to search.

ఆర్టిస్టులకు స‌భ్య‌త్వాలు, గుర్తింపు కార్డులు ఇస్తాం: పోసాని

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కళాకారులు సాంకేతిక నిపుణులందరికీ ID కార్డ్‌లను అందజేస్తామని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 4:19 PM GMT
ఆర్టిస్టులకు స‌భ్య‌త్వాలు, గుర్తింపు కార్డులు ఇస్తాం: పోసాని
X

APFDC చైర్మన్ పోసాని కృష్ణ మురళి కళాకారులందరికీ శుభ‌వార్త చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కళాకారులు సాంకేతిక నిపుణులందరికీ ID కార్డ్‌లను అందజేస్తామని ప్రకటించారు. ఐడి కార్డ్‌లు జారీ చేయడం ద్వారా బయటి వ్యక్తులు కళాకారులను సులభంగా త‌మ సినిమాలు లేదా ఆర్ట్ ఫామ్ లోకి తీసుకోవచ్చు అని అన్నారు. సభ్యత్వ రుసుము చెల్లించాల్సిన ఇతర సంఘాల మాదిరిగా కాకుండా తమ సంఘం ఎలాంటి కమీషన్ వసూలు చేయదని పోసాని స్పష్టం చేశారు.

జూనియర్ ఆర్టిస్టుల వెత‌ల గురించి ప్ర‌స్థావిస్తూ..వారి సంపాదనను ఏజెంట్లు దారుణంగా దోచేస్తున్నార‌ని అన్నారు. మధ్యవర్తుల(బ్రోక‌రీ వ్య‌వ‌స్థ‌)ను తొలగించాల్సిన అవసరం ఉంద‌ని పోసాని నొక్కి చెప్పారు. దర్శకులే నేరుగా ఆర్టిస్టుల‌ను లేదా సాంకేతిక నిపుణుల‌ను సులభంగా కనుగొనే ప్ర‌క్రియ ఏర్పాటు చేస్తామ‌ని సూచించారు. క‌ళాకారుల‌ వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకునేలా ఏర్పాటు చేస్తామ‌న్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా సినిమాలు తీయాలని, కళాకారులకు మరిన్ని రాయితీలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని హామీ ఇచ్చారు.

నటుడు అల్లు అర్జున్‌తో త‌న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ త్రోబ్యాక్ సంఘటనను షేర్ చేసారు. అల్లు అర్జున్ ఓసారి త‌న‌కు ఉదారంగా రూ. 5 లక్షలు డబ్బును ఇచ్చి మంచి పనికి వినియోగించాలని కోరాడ‌ని అత‌డి వ్య‌క్తిత్వాన్ని కొనియాడాడు. చదువు ఖర్చులు భరించలేని ముగ్గురు విద్యార్థులకు ఆ నిధుల్లో కొంత భాగాన్ని పంపిణీ చేశానని పోసాని చెప్పారు. మిగిలిన మొత్తాన్ని కొంద‌రు విద్యార్థులకు కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు వినియోగించాన‌ని తెలిపాడు. అల్లు అర్జున్ దాతృత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పోసాని ఒక కార్యక్రమంలో పిల్లలు అతనికి బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారని గుర్తు చేసారు.

తేదేపా నాయ‌కుల‌పై ఫిక‌ర్:

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీఎఫ్‌డిసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు అసభ్యంగా ప్రవర్తించారని, నారా లోకేష్ కూడా అలాంటి అలవాట్లే అవలంభిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ మొహంపై చంద్రబాబు చెప్పుతో కొట్టారని, ఆయన చనిపోయిన తర్వాత ఎన్టీఆర్‌కు పూలమాల వేయడంపై తన అసమ్మతి వ్యక్తం చేశాన‌ని పోసాని పేర్కొన్నారు. చంద్రబాబు తమ తండ్రి పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించారు. ఇక వంగవీటి రంగా మృతికి చంద్రబాబే కారణమని పోసాని ఆరోపించారు.

నారా లోకేష్‌కు చంద్రబాబులోని ప్రతికూల లక్షణాలన్నీ సంక్రమించాయని, లోకేష్ అంత నీచంగా మరెవ్వరూ మాట్లాడరని ఆరోపించారు. పోలీసు భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబు, లోకేష్‌లు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర అవినీతికి పాల్పడుతున్నారని పోసాని ఆరోపిస్తూ తనపై వచ్చిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు పోసాని. నరేంద్ర గుడిలో ప్రమాణం చేయిస్తారా అని కూడా పోసాని ప్రశ్నించారు. పోసానిపై నారా లోకేష్ పరువు నష్టం కేసు వేసినప్పటి నుంచి టీడీపీ, పోసాని కృష్ణమురళి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మంగళగిరి కోర్టులో నారా లోకేష్ వాంగ్మూలం నమోదు చేయగా, లోకేష్ నుంచి తనకు ముప్పు ఉందని పోసాని కృష్ణమురళి డీజీపీకి ఫిర్యాదు చేశారు.