సోషల్ మీడియా గాలి తీసేసిన పూజా హెగ్డే
తనకు ఇన్‌స్టాలో 26-27 మిలియన్ ఫాలోవర్ల దాకా ఉన్నారని.. అంటే తన కోసం 26-27 మిలియన్ టికెట్లు తెగుతాయని అర్థం కాదని ఆమె వ్యాఖ్యానించింది.
By: Tupaki Desk | 17 April 2025 8:30 AM ISTఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగింది పూజా హెగ్డే. కానీ గత కొన్నేళ్లలో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం తెలుగులో ఆమె ఏ సినిమా చేయట్లేదు. త్వరలో ఓ తెలుగు చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈలోపు తన తమిళ సినిమా రెట్రో ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పూజా.. తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో ఒక ఇంటర్వ్యూలో ఫిలిం సెలబ్రెటీల సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య చూసుకుని విర్రవీగితే లాభం లేదని ఆమె స్పష్టం చేసింది. తనకు ఇన్‌స్టాలో 26-27 మిలియన్ ఫాలోవర్ల దాకా ఉన్నారని.. అంటే తన కోసం 26-27 మిలియన్ టికెట్లు తెగుతాయని అర్థం కాదని ఆమె వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా, వాస్తవ ప్రపంచం వేరు అని.. ఇక్కడ ఫాలోయింగ్ చూసుకుని పొంగిపోవాల్సిన అవసరం లేదని పూజా చెప్పింది. 50 లక్షల ఫాలోవర్లు ఉన్న ఒక స్టార్‌కు అంతకంటే ఎక్కువ మందిని ఆకర్షించగలరని.. అదీ అసలైన ఫాలోయింగ్ అని పూజా పేర్కొంది.
సోషల్ మీడియాలో ఎన్నో బాట్స్ అకౌంట్స్ ఉంటాయని.. వాళ్ల ఫొటోలు ఉండవని.. కాబట్టి మిలియన్లలో ఉన్న ఫాలోవర్లను చూసుకుని మురిసిపోవాల్సిన అవసరం లేదని పూజా స్పష్టం చేసింది. తన వరకు తిరుమలకో, మరో చోటికో వెళ్లినపుడు అభిమానులతో మాట్లాడతానని.. అది తనకెంతో ముఖ్యమని ఆమె అంది. సోషల్ మీడియాకు, వాస్తవ ప్రపంచానికి తేడా తనకు తెలుసని ఆమె పేర్కొంది.
మన పని మనం కరెక్ట్‌గా చేసి రియల్ ఫీడ్ బ్యాక్ తీసుకోవడం చాలా అవసరమని పూజా వ్యాఖ్యానించింది. కొన్నేళ్లుగా సరైన విజయాలు లేని పూజా హెగ్డే.. రెట్రో మీద భారీ ఆశలే పెట్టుకుంది. ఇందులో ఆమె ట్రెడిషనల్ రోల్ చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో మే 1న ఒకేసారి విడుదల కానుంది. అదే రోజు నాని సినిమా హిట్-3 పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
