ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఉపవాసమున్నా!
సినిమాలో చూడ్డానికి ఎంతో కలర్‌ఫుల్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపించే సాంగ్స్ ను తెరకెక్కించడం వెనుక ఎందరో శ్రమ దాగి ఉంటుంది.
By: Tupaki Desk | 18 July 2025 3:00 AM ISTసినిమాలో చూడ్డానికి ఎంతో కలర్‌ఫుల్ గా, ఎంటర్టైనింగ్ గా అనిపించే సాంగ్స్ ను తెరకెక్కించడం వెనుక ఎందరో శ్రమ దాగి ఉంటుంది. కానీ ఆడియన్స్ అవన్నీ పట్టించుకోరు. కేవలం అందులో ఉన్న గ్లామర్ ను మాత్రమే చూసి వావ్ అనుకుంటుంటారు. ఆ సాంగ్ కోసం పడే కష్టం, దాన్ని షూట్ చేసేటప్పుడు వారున్న సిట్యుయేషన్స్ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు, మాట్లాడుకోరు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పటికే రామ్ చరణ్ సరసన రంగస్థలంలో జిగేలు రాణి అనే స్పెషల్ సాంగ్ చేసి ఆ పాటలో తన డ్యాన్సులతో కుర్రాళ్లను ఉర్రూతలూగించగా, తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న కూలీ సినిమాలో మోనికా బెల్లూచి అనే స్పెషల్ సాంగ్ లో కాలు కదిపి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ సాంగ్ లో పూజా హెగ్డే తో పాటూ సౌబిన్ షాహిర్ కూడా స్టెప్పులేయగా వారి డ్యాన్సులకు ఆడియన్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు.
మోనికా బెల్లూచి సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి పూజా ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్తూ ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో తాను మోనికా సాంగ్ కోసం పడిన శ్రమను వెల్లడించారు. కాలు బెణికినప్పటికీ తాను ఆ సాంగ్ కోసం వర్క్ చేసినట్టు పూజా తెలిపారు. మోనికా సాంగ్ తన కెరీర్లోనే ఎంతో కష్టపడిన సాంగ్ అని, ఈ సాంగ్ పై చూపిస్తున్న ఆదరణకు థ్యాంక్స్ చెప్పారు పూజా.
కాలు బెణికిన తర్వాత తాను చేసిన ఫస్ట్ సాంగ్ అని, విపరీతమైన దుమ్ము, ఎండ, వేడి ఉన్నప్పటికీ అవేమీ స్క్రీన్ పై కనిపించకుండా కేవలం గ్లామరస్ గా ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు కష్టపడ్డానని పూజా తెలిపారు. మోనికా సాంగ్ కు తన బెస్ట్ ఇచ్చానని చెప్పిన పూజా థియేటర్లలో ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుందని, సాంగ్ చూసేటప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తారని, మోనికా సాంగ్ ను శివరాత్రి రోజు షూట్ చేశారని, ఆ రోజు తాను ఉపవాసమున్నట్టు పూజా హెగ్డే వెల్లడించారు.
పూజా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, మోనికా సాంగ్ ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో దూసుకెళ్తుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
