Begin typing your search above and press return to search.

ఫిష్ వెంక‌ట్‌లా కిడ్నీ వైఫ‌ల్యంతో మ‌రో న‌టుడు

ఇటీవ‌ల టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ ఫిష్ వెంక‌ట్ కిడ్నీ వైఫ‌ల్యంతో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 July 2025 9:33 AM IST
ఫిష్ వెంక‌ట్‌లా కిడ్నీ వైఫ‌ల్యంతో మ‌రో న‌టుడు
X

ఇటీవ‌ల టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, క‌మెడియ‌న్ ఫిష్ వెంక‌ట్ కిడ్నీ వైఫ‌ల్యంతో వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అన్నిటి కంటే అత‌డి జీవ‌న విధానం గురించి, మ‌ద్యం మ‌త్తుకు బానిస అయిన ప‌రిస్థితుల‌ గురించి మీడియాల్లో ఎక్కువ‌గా చ‌ర్చ సాగింది. కొంద‌రు రోగాల్ని కోరి తెచ్చుకుంటారు. సినీప‌రిశ్ర‌మ‌లో మ‌ద్యానికి బానిసై ఆరోగ్యాన్ని నాశ‌నం చేసుకునే వారికి కొద‌వేమీ లేదు. కెరీర్- సంపాద‌న‌ ప‌రంగా స‌రైన గ్యారెంటీలు లేని ఈ ఒత్తిళ్ల‌ ప‌రిశ్ర‌మ‌లో చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందుకు సాగితేనే బ్రేక్ వ‌స్తుంది. కానీ ఫిష్ వెంక‌ట్ న‌టుడిగా బ్రేక్ వ‌చ్చాక, సంపాద‌నా ప‌రుడిగా మారాక‌ కూడా దానిని దుర్వినియోగం చేసాడు. అత‌డు ఆల్కహాల్ మ‌హ‌మ్మారీ నుంచి త‌ప్పించుకోలేక‌పోయాడు. తాగుడు అత‌డి రెండు కిడ్నీలు ఫెయిల‌వ్వ‌డానికి కార‌ణమైంది. చివ‌రి ద‌శ‌లో ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా అత‌డు త‌న లైఫ్ స్పాన్ ని పెంచుకోలేక‌పోయాడు.

అయితే ఇప్పుడు మ‌రో న‌టుడి ప‌రిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. త‌మిళం, తెలుగు చిత్ర‌సీమ‌ల‌కు సుప‌రిచితుడే అయిన పొన్నంబ‌ళం నెల రోజుల క్రితం వెంటిలేట‌ర్ పై చికిత్స పొందుతూ ధీన స్థితిలో ఉన్న ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అత‌డు రెగ్యుల‌ర్ గా ఆస్ప‌త్రికి వ‌చ్చి డ‌యాలిసిస్ చేయించుకుంటున్నాడు. ఇది అత్యంత క్రూర‌మైన చికిత్స అని కూడా అత‌డు వాపోయాడు.

అత‌డి గురించి ప్ర‌స్థావించాల్సి వ‌స్తే, ఒక‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సెట్లో అత‌డు గొడ‌వ ప‌డ్డాడ‌ని కూడా చెబుతారు. అయితే ఆ గొడ‌వ‌తో ఎలాంటి సంబందం లేకుండా పొన్నంబ‌ళం క‌ష్టం గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి అత‌డి ఆస్ప‌త్రి చికిత్స కోసం ల‌క్ష‌ల్లో ఆర్థిక విరాళం అందించారు. ఇక పొన్నాంబ‌ళంని శ‌ర‌త్ కుమార్, క‌మ‌ల్ హాస‌న్, యాక్ష‌న్ కింగ్ అర్జున్, ధ‌నుష్‌ స‌హా ప‌లువురు ఆర్థికంగా ఆదుకున్నారు. చికిత్స కోసం డ‌బ్బు సాయం చేసారు. కానీ అత‌డి మ‌ద్య‌పానం అల‌వాటు కార‌ణంగా రెండు కిడ్నీలు పాడైపోయి డ‌యాలిసిస్ లో ఉన్నాడు. ఈ నాలుగేళ్ల‌లో దాదాపు 750 ఇంజెక్ష‌న్లు చేయించుకున్నాన‌ని, ఇది అత్యంత క్రూర‌మైన చికిత్స అని అత‌డు క‌ల‌త చెందాడు. ఇప్ప‌టికీ అత‌డిని డ‌యాలిసిస్ తో వైద్యులు బ‌తికిస్తున్నారు. ఇప్ప‌టికే 35ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యింద‌ని, ఆర్థికంగా చితికిపోయాన‌ని పొన్నంబ‌ళం చెప్పాడు. పాతికేళ్ల క్రితం త‌న‌కు పెళ్ల‌యినా అత‌డి కుటుంబం ఆస్ప‌త్రికి చూడ‌టానికి కూడా రాలేద‌ని, తాను వారిని పిల‌వ‌లేద‌ని కూడా పొన్నంబ‌ళం చెప్పాడు. త‌న‌ను స్నేహితులు ఆదుకున్నార‌ని వెల్లడించాడు. పొన్నంబ‌ళం ప‌రిశ్ర‌మ అగ్ర‌హీరోలు చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున‌, బాల‌కృష్ణ, ప‌వ‌న్ క‌ల్యాణ్, ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, అర్జున్ త‌దిత‌రుల సినిమాల్లో న‌టించారు. విల‌న్ గా అత‌డు ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల్లో పాపుల‌ర‌య్యారు.