Begin typing your search above and press return to search.

ఇంత చిన్న విషయానికి స్టార్‌ హీరోపై కేసా?

కాగా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని విజయ్‌ అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Feb 2024 6:45 AM GMT
ఇంత చిన్న విషయానికి స్టార్‌ హీరోపై కేసా?
X

ఇళయ దళపతి విజయ్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళంలో సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తర్వాత ఆ స్థాయిలో అభిమానులను, క్రేజును ఆయన సంపాదించుకున్నారు. అట్టర్‌ ప్లాప్‌ సినిమాలతో వందల కోట్ల రూపాయలు కలెక్షన్లు వసూలు చేయగల సత్తా విజయ్‌ సినిమాలకుంది.


కాగా ఎప్పటి నుంచో రాజకీయాల్లోకి రావాలని విజయ్‌ అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్‌ అభిమానులు.. అభిమాన సంఘం తరఫున పోటీ చేసి విజయాలు కూడా సాధించారు.

ఇక ఎట్టకేలకు విజయ్‌ అభిమానుల నిరీక్షణ ఫలించి ఆయన తన రాజకీయ పార్టీని ప్రకటించారు. తమిళగ వెట్రిగ కళగం పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోమని.. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని విజయ్‌ ప్రకటించారు. కాగా తాను పోటీ చేస్తానో, లేదో అని విజయ్‌ ప్రకటించలేదు. పార్టీ మాత్రం ఎన్నికలలో పోటీ చేస్తుందన్నారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో పార్టీ బలోపేతంపై విజయ్‌ దృష్టి సారించారు. జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా పార్టీ ఇంచార్జులను నియమించే పనిలో విజయ్‌ ఉన్నారు. పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేశాక 2026 ఎన్నికల బరిలో తమిళగ వెట్రిగ కళగంను బరిలో దించాలని యోచిస్తున్నారు.

అయితే రాజకీయాల్లో విజయ్‌ వచ్చారో, లేదో అప్పుడే ఆయనకు షాక్‌ తగిలింది. ఆయనతోపాటు పార్టీకి చెందిన 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన తమిళగ వెట్రిగ కళగం నేతలు ఆయా నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశాల్లో భాగంగా కళ్లకురిచ్చి జిల్లా ఉలందూర్‌ పేట నియోజకవర్గంలోనూ తమిళగ వెట్రిగ కళగం నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున విజయ్‌ ఫొటోలతో బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే స్థానిక పోలీసుల నుంచి బ్యానర్లు, ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తీసుకోలేదు. దీంతో పోలీసులు విజయ్‌ తోపాటు తమిళగ వెట్రిగ కళగం నేతలు 20 మందిపై కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో తమిళగ వెట్రిగ కళగం నేతలు పోలీసులపై మండిపడుతున్నారు. విజయ్‌ రాజకీయాల్లోకి వచ్చారని.. ఆయనను ఇబ్బంది పెట్టడానికే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. విజయ్‌ ను చూసి అధికార, ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయని ఎద్దేవా చేస్తున్నారు. విజయ్‌ పైన కేసు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారింది.