Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 'పెద్ది' వెన‌క ప్రధాని మోదీ నిజ జీవిత ఘటన!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, జాన్వీ కపూర్ కథానాయికగా రూపొందిన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా చిత్రం `పెద్ది` జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   30 May 2026 4:53 PM IST
రామ్ చరణ్ పెద్ది వెన‌క ప్రధాని మోదీ నిజ జీవిత ఘటన!
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, జాన్వీ కపూర్ కథానాయికగా రూపొందిన ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా చిత్రం `పెద్ది` జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొని గతంలో తాను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినప్పుడు త‌మ మ‌ధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌ సంభాషణను గుర్తు చేసుకున్నారు. పెద్ది చిత్రం కథాంశం గురించి ప్రధాని మోదీ ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని... ఆ సమయంలో గ్రామీణ భారతదేశం, క్రీడల నేపథ్యం గురించి వివ‌రించాన‌ని చ‌ర‌ణ్ చెప్పారు. ఆ ఇద్ద‌రి న‌డుమా సంభాషణ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ సమావేశంలో ప్రధాని అడిగిన ప్రశ్నకు రామ్ చరణ్ సమాధానమిస్తూ.. గతంలో నేను ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు ఆయన నన్ను `పెద్ది` సినిమా కథ దేని గురించి అని అడిగారు. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం, మన గ్రామాలను సాధికారిత వైపు నడిపించే కథ అని నేను ప్ర‌ధానికి చెప్పాన‌ని చ‌ర‌ణ్‌ తెలిపారు. రామ్ చరణ్ మాటలకు స్పందించిన ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక అద్భుతమైన నిజ జీవిత స్ఫూర్తిదాయక కథను షేర్ చేసారు.

దశాబ్దాల క్రితం పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన ఒక ఫుట్‌బాల్ క్రీడాకారుడు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడని అత‌డు ఇచ్చిన స్ఫూర్తితో నేడు అదే గ్రామం నుండి ఏకంగా 85 మందికి పైగా క్రీడాకారులు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆడుతున్నారని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చరణ్‌కు వివరించారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ... ప్రస్తుతం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులను , గ్రామీణ కథల ప్రాధాన్యతను ప్రశంసించారు. ``ఈ రోజుల్లో మేము సౌత్‌లో నిర్మిస్తున్న సినిమాలు మన సంస్కృతికి, మన మట్టికి ఎంతో దగ్గరగా ఉంటున్నాయి. ఇవి నగరాల నేపథ్యంలో కాకుండా పల్లెటూళ్లు, చిన్న పట్టణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్నాయి`` అని చెప్పారు. గ్రామాలలో దాగి ఉన్న ఇటువంటి అసాధారణ క్రీడా ప్రతిభను వెలికితీసి.. వారికి తగిన గుర్తింపు లభించినప్పుడే దేశం మరింత ముందుకు సాగుతుందని చరణ్ అభిప్రాయపడ్డారు.

భారతదేశంలోని గిరిజన ప్రాంతాల నుండి వస్తున్న క్రీడాకారుల ప్రతిభను ఉదాహరిస్తూ.. భారత విలువిద్య (ఆర్చ‌రీ) టీమ్‌లో అత్యధిక శాతం మంది గిరిజన అథ్లెట్లే ఉన్నారని రామ్ చరణ్ గుర్తుచేశారు. పుట్టుకతోనే విల్లు- బాణాలను ఉపయోగించే సహజసిద్ధమైన నైపుణ్యం వారికి ఉంటుందని.. వారెవ్వరూ నగరాల నుండి గానీ లేదా వైఎమ్‌సీఏ (YMCA) వంటి పెద్ద పెద్ద అకాడమీల నుండి రాలేదని చెప్పారు. గిరిజన - గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఈ సహజ ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ అందించిన `ఆర్చ‌రీ బోర్డు` అధికారుల నిర్ణయం నిజంగా అభినందనీయమని కొనియాడారు.

బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన `పెద్ది` చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ, జగపతి బాబు వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూన్ 4వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే బలమైన స్పోర్ట్స్ డ్రామా, ఎమోషన్స్.. దీనికి తోడు ప్రధాని మోదీ సైతం ఆసక్తి చూపిన కథాంశం కావడం వల్ల ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ.. ఇటు రాజకీయ, సినీ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.