మూవీ పైరసీ చేస్తే.. శిక్ష ‘లెక్క’ మారింది జాగ్రత్త!
ఇటీవల కాలంలో హిట్టు, ఫట్టూ అనే ఫలితం సంగతి కాసేపు పక్కనపెడితే.. సినిమాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య "పైరసీ" అని చెప్పొచ్చు.
By: Tupaki Desk | 28 July 2025 10:36 AM ISTఇటీవల కాలంలో హిట్టు, ఫట్టూ అనే ఫలితం సంగతి కాసేపు పక్కనపెడితే.. సినిమాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య "పైరసీ" అని చెప్పొచ్చు. ఈ క్రమంలో... డిజిటల్ పైరసీని అరికట్టే ప్రయత్నంలో భాగంగా చట్టవిరుద్ధంగా సినిమాలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడంలో పాల్గొన్న వారికి శిక్షలు పెంచేలా ప్రభుత్వం చట్టాన్ని సవరించింది.
అవును... సినిమాలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడం వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి శిక్షలు పెంచేలా ప్రభుత్వం చట్టాలను సవరించింది. ఇందులో భాగంగా... ఇకపై పైరసీ చేసినా, దాన్ని ప్రసారం చేసినా జైలు శిక్షతో పాటు నిర్మాణ వ్యయంలో ఐదు శాతం వరకూ కఠినమైన జరిమానాలు విధించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరించింది!
ఈ సందర్భంగా స్పందించిన సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురగన్... గతంలో పైరసీకి మూడు నెలల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా ఉన్నాయని.. అయితే, తాజాగా దానిని మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఆడిట్ చేయబడిన స్థూల ఉత్పత్తి వ్యయంలో ఐదు శాతం వరకు జరిమానా విధించవచ్చని పార్లమెంటుకు తెలిపారు.
ఈ సందర్భంగా... సినిమాటోగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 6ఏఏ, 6ఏబీ అనధికారికంగా సినిమాలను రికార్డ్ చేయడం, ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో పైరసీ వ్యతిరేక వ్యూహాలను బలోపేతం చేయడానికి, సమన్వయ కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి అంతర్ మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేశారు.
కాగా... ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) నిర్వహించిన ‘ది రాబ్’ నివేదిక ప్రకారం 2023లో భారత వినోద పరిశ్రమ ప్రధానంగా పైరసీ కారణంగా రూ.22,400 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంది!
