Begin typing your search above and press return to search.

యంగ్ డైరెక్టర్.. ఉన్న గొడవ సరిపోదని

‘మధురం’ అనే షార్ట్ ఫిలింతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు.. ఫణీంద్ర నర్సెట్టి. యూట్యూబ్‌లో ఆ లఘు చిత్రం చిన్నపాటి సంచలనమే రేపింది.

By:  Tupaki Desk   |   19 Jun 2025 2:00 AM IST
యంగ్ డైరెక్టర్.. ఉన్న గొడవ సరిపోదని
X

‘మధురం’ అనే షార్ట్ ఫిలింతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు.. ఫణీంద్ర నర్సెట్టి. యూట్యూబ్‌లో ఆ లఘు చిత్రం చిన్నపాటి సంచలనమే రేపింది. భారీగా వ్యూస్ తెచ్చుకుని సినిమా స్థాయిలో ఆదరణ పొందింది. ఫీచర్ ఫిలిం చేయడానికి ముందే ఫణీంద్రకు ఫ్యాన్స్ తయారయ్యారు. టాలీవుడ్లో దర్శకుడిగా తన ఎంట్రీ కోసం వాళ్లంతా ఎదురు చూశారు.

కానీ తన తొలి చిత్రం ‘మను’ ప్రేక్షకాదరణ పొందలేదు. ప్రయోగాత్మక కథతో చేసిన ఈ సినిమాను కూడా మెచ్చిన వాళ్లు లేకపోలేదు కానీ.. ఎక్కువమంది దీన్ని తిరస్కరించారు. థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపకుండానే వెళ్లిపోయింది ‘మను’. ఐతే చాలా గ్యాప్ తర్వాత ఫణీంద్ర మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్లో అవకాశం అందుకుని, ‘8 వసంతాలు’ సినిమా తీశాడు. ఈ శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఐతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఫణీంద్ర చేసిన కొన్ని అగ్రెసివ్ కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా ‘థగ్ లైఫ్’ సినిమా విషయంలో మణిరత్నంను విమర్శించిన వాళ్ల మీద అతను ఘాటుగా స్పందించాడు. మణిరత్నానికి సినిమా ఎలా తీయాలో నేర్పిస్తారా, మీకేం అర్హత ఉంది అంటూ మండిపడ్డాడు. ఐతే సినిమా బాగుంది, బాలేదు అని చెప్పడానికి కూడా అర్హత కావాలా అంటూ నెటిజన్లు ఫణీంద్ర మీద గట్టిగానే ఎదురుదాడి చేశారు. తన ఇంటర్వ్యూల్లో మరి కొన్ని కామెంట్లు కూడా ప్రేక్షకులను తక్కువ చేసేలా ఉన్నాయంటూ అతడిని విమర్శించారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే.. మరోసారి తన కామెంట్లతో సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యాడు ఫణీంద్ర.

‘8 వసంతాలు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఫణీంద్ర కమర్షియల్ సినిమాల గురించి తేలికగా మాట్లాడ్డం చర్చనీయాంశం అయింది. తాను కమర్షియల్ సినిమాలు తీయలేక కాదు, తీయాలని లేక వాటిని ట్రై చేయట్లేదని అన్నాడు. తాను తన అభిరుచి మేరకు ఎంతో తపనతో సినిమాలు తీస్తున్నానని.. ఒక్క పది నిమిషాలు తన పెన్ను పక్కన పెట్టి వేరేలా ఆలోచిస్తే వ్యవహారం వేరుగా ఉంటుందని అతనన్నాడు.

తాను అలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో సినిమాలో వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్సే ఉదాహరణ అని.. ఈ మాటను గుర్తు పెట్టుకుని సినిమా చూడాలని అతను వ్యాఖ్యానించాడు. ఐతే కమర్షియల్ సినిమా అంటే చాలా సులువైన వ్యవహారం, దాని స్థాయి తక్కువ అన్నట్లు ఫణీంద్ర మాట్లాడడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఏ తరహా సినిమా తీశామన్నది ముఖ్యం కాదని.. ఎక్కువమంది జనాలకు నచ్చే సినిమా తీయడం ప్రధానమని.. దాని మీద దృష్టిపెట్టకుండా కమర్షియల్ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడ్డం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.