Begin typing your search above and press return to search.

పెళ్లి కాని ప్రసాద్ ఎప్పటికీ స్పెషలే..!

ఈ సినిమాలో వెంకటేష్ చేసిన పెళ్లి కాని ప్రసాద్ రోల్ ఇప్పటికీ ఆడియన్స్ కి గుర్తుంది.

By:  Tupaki Desk   |   18 Feb 2024 12:24 PM GMT
పెళ్లి కాని ప్రసాద్ ఎప్పటికీ స్పెషలే..!
X

విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాల్లో మల్లీశ్వరి సినిమా స్పెషల్ గా ఉంటుంది. స్టార్ హీరోగా ఫ్యామిలీ అంతా కూడా కలిసి చూసే సినిమాలు చేసే వెంకటేష్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం మల్లీశ్వరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రివిక్రం స్టోరీ, డైలాగ్స్ అందించిన ఈ సినిమాను విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు. సినిమాలో బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. సినిమాకు కోటి మ్యూజిక్ అందించారు.

వెంకటేష్ విజయ్ భాస్కర్ కలిసి చేసిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా మలీశ్వరి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్ చేసిన పెళ్లి కాని ప్రసాద్ రోల్ ఇప్పటికీ ఆడియన్స్ కి గుర్తుంది. త్రివిక్రం మార్క్ డైలాగ్స్ తో వెంకటేష్ నటన అదిరిపోయింది.

వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టేది కాదు. సినిమా ఆద్యంతం నవ్విస్తూ నవ్వుతూ ఉండాలనిపించేలా ఉంటాయి. 2004 ఫిబ్రవరి 18న రిలీజైన మల్లీశ్వరి సినిమా క్లాసు మాసు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఎక్స్ లో మెసేజ్ చేశారు. అంతేకాదు మల్లీశ్వరి స్పెషల్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు.

పెళ్లి కానీ ప్రసాద్ గా 20 ఏళ్ల నుంచి ప్రేమ నవ్వులు పంచాడు. ఈ సినిమా ఇలానే హృదయాలను గెలిచేందుకు చీర్స్ అంటూ రాసుకొచ్చారు. ఈమధ్య సూపర్ హిట్ సినిమాలన్నీ కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. పెళ్లి కాని ప్రసాద్ అదే మల్లీశ్వరి సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేస్తే మరోసారి థియేటర్ లో ఆ నవ్వుల పువ్వులు విరబూసే అవకాశం ఉంటుంది. వెంకటేష్ ఏ సినిమా ప్రమోషన్స్ కి వచ్చినా పెళ్లి కాని ప్రసాద్ అంటూ అతన్ని ఫ్యాన్స్ అంటుంటారు. అంతగా మల్లీశ్వరి సినిమా వారి హృదయాలను గెలిచింది.

కొన్ని సినిమాల్లో పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్ పెళ్లి కాని ప్రసాద్ రోల్ ఒకటి. మరోసారి వెంకటేష్ ఇలాంటి ఎనర్జిటిక్ రోల్ లో చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మల్లీశ్వరి రైటర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా వెంకటేష్ సినిమా చేయాలని వారు ఆశిస్తున్నారు.