గుర్తింపుకు నోచుకోని గ్రామాల అస్థిత్వం కోసం 'పెద్ది' తీసాను: బుచ్చిబాబు
భారతదేశంలో గుర్తింపునకు నోచుకోని వేలాది గ్రామాల దుస్థితిని ఈ చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశానని దర్శకుడు తెలిపారు.
By: Sivaji Kontham | 9 Jun 2026 9:48 AM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం `పెద్ది` ఇటీవల థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల నీరాజనాలు అందుకుంటోంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ తాజాగా `థాంక్ యూ` ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసి తమ ఆనందాన్ని పంచుకుంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇది కేవలం వినోదాన్ని పంచే కమర్షియల్ చిత్రం మాత్రమే కాదని, ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే స్ఫూర్తిదాయక కథ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన `ఖేలో ఇండియా` కార్యక్రమం ఈ కథను రాయడానికి తనకు ప్రధాన ప్రేరణగా నిలిచిందని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు సరైన వేదిక దొరికితే దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తీసుకురాగలరనే నమ్మకాన్ని ఈ సినిమా బలంగా చాటుతుందని స్పష్టం చేశారు.
భారతదేశంలో గుర్తింపునకు నోచుకోని వేలాది గ్రామాల దుస్థితిని ఈ చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశానని దర్శకుడు తెలిపారు. తన ఊరి అస్తిత్వం కోసం.. సమాజంలో తన సొంత గుర్తింపు కోసం ఒక సామాన్యుడు చేసిన పోరాటమే `పెద్ది` అని ఆయన వివరించారు. కథలోని అంతర్లీన సందేశాన్ని నమ్మి.. ఈ వినూత్న ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలిచిన హీరో రామ్ చరణ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ అందించిన అసాధారణ మద్దతు వల్లే ఈ రోజు సినిమా ఇంతటి ఘనవిజయాన్ని సాధించిందని కొనియాడారు.
సినిమా చూస్తున్న ప్రేక్షకులు ముఖ్యంగా ముగింపు సన్నివేశాల్లో.. ఆసుపత్రి సీన్లలో అమితమైన భావోద్వేగానికి లోనవుతున్నారని... థియేటర్లలో చప్పట్లతో హోరెత్తిస్తున్నారని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. చిత్రంలో కీలకమైన `అప్పలసూరి` పాత్రలో జగపతిబాబు అద్భుతమైన నటనను కనబరిచారని ప్రశంసించారు. రామ్ చరణ్ నటనకు గాను కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందంటూ అభిమానులు, సినీ విశ్లేషకులు సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపిస్తుండటంపై దర్శకుడు హర్షం వ్యక్తం చేశారు.
వేసవి సెలవుల్లో నానమ్మ, అమ్మమ్మల ఊరికి వెళ్లినంత హాయిగా.. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి `పెద్ది` సినిమాను ఆస్వాధించాలని చిత్ర యూనిట్ పిలుపునిచ్చింది. తనకు ఈ భారీ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇచ్చిన నిర్మాత సతీష్ కిలారుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిదాయకమైన చిత్రాన్ని ఆదరించి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
