తండ్రిగా ఆ ఒక్కటీ నా వల్ల కాదనేసిన రామ్ చరణ్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తాను నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది` ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.
By: Sivaji Kontham | 3 Jun 2026 4:00 PM ISTమెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తాను నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా `పెద్ది` ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా 4 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో అతడు తన వ్యక్తిగత జీవితం- తండ్రిగా బాధ్యతలు, భార్య ఉపాసనతో తనకున్న బంధం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇంట్లో ఉపాసనే `బాస్` అని చమత్కరించిన చరణ్... పిల్లల పెంపకంలో తాను ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా అన్ని పనులూ చూసుకుంటానని.. కానీ ఒకే ఒక్క పని విషయంలో మాత్రం అక్కడి నుంచి జారుకుంటానని సరదాగా తెలిపారు.
కూతురు క్లిన్ కారాతో పాటు ఈ ఏడాది జనవరిలో జన్మించిన కవల పిల్లలు (శివ రామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల) తో తనకున్న అనుబంధాన్ని చరణ్ గుర్తుచేసుకున్నారు. తాను ఒక మంచి తండ్రిగా ఉన్నానో లేదో తెలీదు కానీ.. పిల్లలతో చాలా చురుగ్గా ఉంటానని.. వారి బాగోగులు చూసుకుంటానని చరణ్ చెప్పారు. వారికి స్వయంగా అన్నం తినిపించడం, పడుకోబెట్టడం వంటివన్నీ చేస్తాను. దాదాపు ప్రతి రాత్రి కారా నా పక్కనే పడుకుంటుంది. ఒక తండ్రిగా చేయాల్సినవన్నీ చేస్తాను కానీ.. డైపర్లు మార్చడం మాత్రం నా వల్ల కాదు. ఆ సమయం రాగానే రూమ్ నుండి గప్‌చిప్‌గా బయటకు వచ్చేస్తాను! అంటూ చరణ్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.
భార్య ఉపాసనతో రిలేషన్‌షిప్‌పై మాట్లాడుతూ.. ఒక నటుడి జీవితం చాలా అనాలోచితంగా సాగుతుందని... ఎప్పుడు ఏ టైమ్‌కి షూటింగ్స్ ఉంటాయో తెలియని పరిస్థితుల్లో భార్యతో, కుటుంబంతో జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం వెనుక చాలా సర్దుబాట్లు ఉంటాయని చరణ్ పేర్కొన్నారు. తన వివాహం తొలినాళ్లలో ఎదుర్కొన్న కెరీర్ ఒత్తిళ్ల గురించి చరణ్ ఈ విధంగా మాట్లాడారు. ఇక చరణ్- ఉపాసన ఇద్దరూ పాఠశాల విద్యార్థుల దశలోనే మంచి స్నేహితులు.. కానీ ఆ ఇద్దరూ కొన్నేళ్ల తర్వాత తిరిగి కలిసారు. ఆ సమయంలో ప్రేమలో పడిన తర్వాత పెద్దల్ని ఒప్పించి 2012లో పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం చరణ్ గ్లోబల్ స్టార్ గా వెలిగిపోతున్నాడు. ముగ్గురు పిల్లల బాధ్యతల్ని నెరవేరుస్తూనే అతడు నటుడిగా కెరీర్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన `పెద్ది` చిత్రం విజయనగరం నేపథ్యంలో సాగే ఒక అథ్లెట్ కథతో రూపొందింది. ఈ పాత్ర కోసం చరణ్ తీవ్రమైన శిక్షణ తీసుకోవడమే కాకుండా షూటింగ్‌లో గాయపడ్డారు కూడా.
చరణ్ కథానాయకుడిగా, జాన్వీ కపూర్ కథానాయికగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎంతో ఇష్టపడి చేసిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మెగా అభిమానులు థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు తండ్రిగా ముగ్గురు పిల్లల బాధ్యతలను చూసుకుంటూనే.. మరోవైపు గ్లోబల్ స్టార్‌గా తన సినిమాలను ప్రమోట్ చేస్తూ రామ్ చరణ్ రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
