రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తున్న పెద్ది
అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ పెద్ది డిజిటల్ రైట్స్ ను రూ.105 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుందని సమాచారం.
By: Tupaki Desk | 15 July 2025 2:36 PM ISTకొన్ని సినిమాలు రిలీజయ్యాక అందులో ఉన్న కంటెంట్ తో వార్తల్లో నిలిస్తే, మరికొన్ని సినిమాలు అందులో ఎలాంటి కంటెంట్ లేకపోవడంతో వార్తల్లో నిలుస్తాయి. ఇంకొన్ని సినిమాలైతే రిలీజ్ కు ముందే వివిధ అంశాలతో వార్తల్లో నిలవడమే కాకుండా రికార్డులు కూడా సృష్టిస్తాయి. ఇప్పుడు అలా ఓ తెలుగు సినిమా రికార్డు సృష్టించింది. అదే పెద్ది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ది. 1980 నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తోనే మంచి అంచనాలను కలిగించింది. పెద్ది కోసం బుచ్చిబాబు విజన్ చాలా గొప్పగా ఉందని అతనితో పరిచయమున్న ప్రతీ ఒక్కరూ చెప్తున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. పెద్ది సినిమాను బుచ్చిబాబు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న కారణంతో సినిమా మొత్తాన్ని విజయనగరంలోనే షూట్ చేయాల్సి ఉంది. అందుకోసం మేకర్స్ హైదరాబాద్ కు దగ్గర్లోనే విజయనగరంను సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ సెట్ కేవలం ఇల్లు మాత్రమే కాదు, విజయనగరం రోడ్లు, రైల్వే స్టేషన్, ఆఖరికి అలనాటి స్పోర్ట్స్ స్టేడియంను కూడా సెట్స్ వేస్తున్నారట.
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ఈ సెట్ కు నేతృత్వం వహిస్తున్నారట. ఇవన్నీ వింటుంటే పెద్ది బడ్జెట్ చాలా భారీగానే అయ్యేట్టుంది. మొదట్లో రూ.250 కోట్లతో మొదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లు దాటిందని సమాచారం. సెట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే నాటికి ఇంకా పెరిగే ఛాన్సుంది. అయితే ఇంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న పెద్దికి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగే అవకాశముంది.
అందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ పెద్ది డిజిటల్ రైట్స్ ను రూ.105 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుందని సమాచారం. ఒక తెలుగు సినిమాకు వచ్చిన ఓటీటీ డీల్స్ లో ఇప్పటివరకు ఇదే ఎక్కువ. పెద్ది రేంజ్ ను ఈ అంశాలే విపరీతంగా పెంచుతున్నాయంటే దానికి తోడు సినిమాకు పని చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ కూడా పెద్దిపై అంచనాలను పెంచేస్తున్నాయి. పెద్దిలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
