Begin typing your search above and press return to search.

'దురంధ‌ర్' ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ గ్లోబ‌ల్ స్టార్‌ ఫాలో చేయ‌డం స‌రైన‌దేనా?

నేటి సినిమా ప్రపంచంలో కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదు.. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసే బలమైన ప్రచార వ్యూహం కూడా అత్యంత కీలకం.

By:  Tupaki Desk   |   4 May 2026 5:00 PM IST
దురంధ‌ర్ ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ గ్లోబ‌ల్ స్టార్‌ ఫాలో చేయ‌డం స‌రైన‌దేనా?
X

నేటి సినిమా ప్రపంచంలో కేవలం మంచి కంటెంట్ ఉంటే సరిపోదు.. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసే బలమైన ప్రచార వ్యూహం కూడా అత్యంత కీలకం. ప్రస్తుతం అంతా `పాన్-వరల్డ్` ట్రెండ్ నడుస్తోంది. ఒక స్థానిక కథనైనా.. సరైన కమర్షియల్ హంగులు జోడించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడం సాధ్యమేనని పలు చిత్రాలు నిరూపించాయి. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న `పెద్ది` వంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేసే విషయంలో మైత్రి మూవీ మేకర్స్ టీమ్ మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉందనే చర్చ మెగాభిమానుల్లో మొదలైంది.

రణవీర్ సింగ్ నటించిన `దురంధర్ 2` చిత్రం కేవలం 46 రోజుల్లోనే బాహుబలి 2 రికార్డులను అధిగమించడానికి ఆ చిత్ర బృందం అనుసరించిన ప్రమోషనల్ స్ట్రాటజీయే ప్రధాన కారణం. హాలీవుడ్ తరహాలో ఒక భారీ `స్పై యూనివర్స్`ను సృష్టించి కేవలం హీరోపైనే కాకుండా సినిమాలోని ప్రతి పాత్రపైనా ఆసక్తిని పెంచేలా వారు చేసిన ప్రచారం సినిమాకు గ్లోబల్ రీచ్ ఇచ్చింది. అంత‌కుముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాకి గ్లోబ‌ల్ రీచ్ కోసం చాలా ప్ర‌చారం చేసారు. అయితే పెద్ది సినిమాకి ఈ రెండిటితో పోలిక లేక‌పోయినా.. ఆర్.ఆర్.ఆర్ స్టార్ గా చ‌ర‌ణ్ కి ఉన్న వ‌ర‌ల్డ్ వైడ్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ రేంజు ప్ర‌చారం జ‌ర‌గ‌డం లేద‌నే అసంతృప్తి అభిమానుల‌కు ఉంది.

ఇప్పటివరకు ప్రచారం కేవలం రామ్ చరణ్ చుట్టూనే తిరగడం బాగానే ఉన్నా... ఇతర భాషల స్టార్ల ఉనికిని చాటడం ద్వారా మార్కెట్ పరిధిని పెంచే అవకాశాన్ని దురంధర్ టీమ్ లాగా పెద్ది టీమ్ కూడా అందిపుచ్చుకోవడం లేద‌ని విశ్లేషిస్తున్నారు. క‌నీసం ద‌క్షిణాది అంత‌టా, ఉత్త‌రాది మార్కెట్లో పెద్దికి ప్ర‌చారం ఆశించినంత లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నిజానికి `పెద్ది` విషయంలో మార్కెట్ విస్తరణకు బోలెడంత అవకాశం ఉంది. శివ రాజ్‌కుమార్ వంటి కన్నడ అగ్ర హీరోలను, దివ్యేందు వంటి యూత్ క్రేజ్ ఉన్న నటులను ప్రమోషన్లలో ముందు వరుసలో ఉంచడం వల్ల కన్నడ లో అలాగే నార్త్ ఇండియా మార్కెట్లలో ముందే భారీ బజ్ క్రియేట్ చేయవచ్చు. కేవలం హీరోని మాత్రమే చూపిస్తే అది `వన్ మ్యాన్ షో`లా కనిపిస్తుంది.. కానీ జగపతి బాబు లేదా ఇతర కీలక నటుల పాత్రలను రివీల్ చేయడం వల్ల కథలో బలమైన ఘర్షణ ఉందనే కుతూహలం ప్రేక్షకుల్లో కలుగుతుంది. దురంధర్ చిత్రం సరిగ్గా ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్ ఎలిమెంట్స్‌తోనే గ్లోబల్ హైప్‌ను నిర్మించి సక్సెస్ అయింద‌నే విశ్లేష‌ణ సాగుతోంది.

దురంధర్ టీమ్ అనుసరించిన మరో కీలక వ్యూహం `టెక్నికల్ ఎక్సలెన్స్`ను హైలైట్ చేయడం. విజువల్ ఎఫెక్ట్స్ .. యాక్షన్ సీక్వెన్సుల మేకింగ్ వీడియోల ద్వారా వారు సినిమా ప్రమాణాలను ప్రపంచానికి చాటి చెప్పారు. పెద్ది చిత్రానికి కూడా ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాల సంగీతం, బుచ్చిబాబు మేకింగ్ స్టైల్ తోడయ్యాయి. ఈ సినిమా స్థాయిలోనే.. త‌మ‌ బలాన్ని ప్రమోషన్లలో ముందే ప్రదర్శించడం వల్ల `గ్లోబల్ బ్రాండింగ్` సులభమవుతుంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ వంటి తారల పాత్రలను కేవలం పాటలకే పరిమితం చేయకుండా.. వారి క్యారెక్టరైజేషన్‌ను పరిచయం చేస్తే కథతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.

ఐపీఎల్ - టీవీ రియాలిటీ షోల వంటి భారీ వ్యూయర్‌షిప్ ఉన్న ప్రోగ్రామ్స్ నడుస్తున్న కాలంలోనే ప్రేక్షకుల దృష్టిని నిరంతరం సినిమాపైనే ఉంచడం ఒక పెద్ద సవాల్‌. దురంధర్ టీమ్ అగ్రెసివ్ మార్కెటింగ్- డిజిటల్ నెట్‌వర్కింగ్‌తో ఈ విషయంలో విజయం సాధించింది. బుచ్చిబాబు సానా ఇప్పటికే `ఉప్పెన`తో తన సత్తా నిరూపించుకున్నారు. ఇప్పుడు `పెద్ది` వంటి భారీ చిత్రానికి గ్లోబల్ ప్రమోషనల్ మోడల్‌ను తోడు చేస్తే.. బాక్సాఫీస్ వద్ద మంచి ఫ‌లితాన్ని ఆశించవ‌చ్చు. దురంధ‌ర్ రేంజు రికార్డులు అవ‌స‌రం లేదు.. కానీ ప్ర‌చారంతో ఆ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు మ‌న సినిమా కూడా రేసులో ఉంద‌ని చూప‌డం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా ఆర్.ఆర్.ఆర్ స్టార్ గా చ‌ర‌ణ్ కి ఉన్న గ్లోబ‌ల్ ఫాలోయింగ్ దృష్ట్యా ఆ దిశ‌గా పెద్ది టీమ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంద‌నే ఫ్యాన్స్ భావిస్తున్నారు.