Begin typing your search above and press return to search.

తండ్రిని త‌ల‌చి క‌న్నీళ్ల‌తో ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన పాయ‌ల్!

ముఖ్యంగా తన కెరీర్‌లో మలుపు తిప్పిన `ఆర్‌ఎక్స్ 100` సినిమా గురించి మాట్లాడుతూ...అది కొంత బోల్డ్ పాత్ర అయినా తన తండ్రి ఎంతో హుందాగా స్పందించారని తెలిపారు.

By:  Sivaji Kontham   |   28 April 2026 11:01 PM IST
తండ్రిని త‌ల‌చి క‌న్నీళ్ల‌తో ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన పాయ‌ల్!
X

పాయ‌ల్ రాజ్ పుత్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆర్.ఎక్స్ 100, మంగ‌ళ‌వారం స‌హా ప‌లు చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న ఈ పంజాబీ బ్యూటీ ఇటీవ‌ల వ్య‌క్తిగ‌త జీవితంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తాను ఎంత‌గానో ప్రేమించే త‌న తండ్రిని కోల్పోయాక మాన‌సికంగా కుంగుబాటుకు లోన‌య్యారు.

ఇప్పుడు ఓ ప్రెస్ మీట్ లో పాయల్ రాజ్‌పుత్ తన తండ్రిని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న ప్ర‌స్తుత‌ మాన‌సిక ప‌రిస్థితి గురించి ఓ జ‌ర్న‌లిస్ట్ నేరుగా పాయ‌ల్ ని ప్ర‌శ్నించారు. జైపూర్‌లో విపాసన ధ్యాన ప్రక్రియలో పాల్గొన్నప్పటి అనుభవాలను ప్ర‌శ్నించ‌గా పాయ‌ల్ జ‌వాబిచ్చారు. తన జీవితంలో తండ్రికి ఉన్న ప్రాముఖ్యతను ఈ న‌టి వివరించారు. సరిగ్గా తాను విపాస‌న‌ ధ్యాన కోర్సులో చేరిన సమయంలోనే తన తండ్రికి క్యాన్సర్ అని నిర్ధారణ అయిందని..అది తమ కుటుంబం మొత్తానికి అత్యంత బాధాకరమైన సమయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అర్థం కాక... తన మనసు అల్లకల్లోలంగా ఉండేదని పాయల్ పేర్కొన్నారు.

తండ్రిని తన జీవితంలో ఒక గొప్ప హీరోగా అభివర్ణించిన పాయల్.. ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు కూడా తన సినిమాల గురించి ఆరా తీసేవారని తెలిపారు. ఇటీవల విడుదలైన తన పంజాబీ సినిమా `ఖుష్‌ఖబరి`ని చూడాలని త‌న తండ్రి ఎంతగానో తపించారని గుర్తు చేసుకున్నారు. తన సినిమాలకు సంబంధించి ఆయన అతిపెద్ద విమర్శకుడని... ఏ సినిమా విడుదలైనా నిష్పక్షపాతంగా తన అభిప్రాయాన్ని చెప్పేవారని వివరించారు. నాన్న గారి ప్రోత్సాహం వల్లే తాను నటిగా ఈ స్థాయికి చేరుకున్నానని పాయల్ భావోద్వేగంతో చెప్పారు.

ముఖ్యంగా తన కెరీర్‌లో మలుపు తిప్పిన `ఆర్‌ఎక్స్ 100` సినిమా గురించి మాట్లాడుతూ...అది కొంత బోల్డ్ పాత్ర అయినా తన తండ్రి ఎంతో హుందాగా స్పందించారని తెలిపారు. ``నువ్వు నీ పాత్రను చాలా అద్భుతంగా పోషించావు... నువ్వు ఒక గొప్ప నటివి`` అని ఆయన అన్న మాటలు ప్రపంచంలో అన్నిటికంటే మిన్న అని అన్నారు. తన ప్రతిభను గుర్తించి చేసిన‌ తండ్రి ప్రశంసను ఎప్పటికీ మర్చిపోలేనని.. ఆయన లేని లోటు తనను ఎంతగానో వేధిస్తోందని చెబుతూ పాయల్ కన్నీటి పర్యంతమయ్యారు.

వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఇటువంటి తీరని లోటు చాలా మంది నటీమణులను మానసికంగా కుంగదీస్తాయి. పాయల్ కూడా తన తండ్రి మరణం తర్వాత తీవ్ర కుంగుబాటుకు లోనయ్యారని..ఆ బాధ నుండి బయటపడి మానసిక శాంతిని పొందేందుకే విపాసన ధ్యాన శిక్షణ తీసుకున్నానని వెల్లడించారు. తండ్రిని ఎంతగానో ప్రేమించే పాయల్.. ఆయన జ్ఞాపకాల్లోకి వెళుతూ మీడియా సమావేశంలో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయారు. ఇది చూసిన పలువురు త‌న‌కు ధైర్యం చెబుతూ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇక పాయల్ కెరీర్ విషయానికి వస్తే... ప్రస్తుతం పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. 2026లో త‌ను నటించిన గోల్ మాల్, కిరాత‌క వంటి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వ్యక్తిగత బాధలను పక్కన పెట్టి.. నటిగా తన తండ్రికి ఇష్టమైన రీతిలో మరిన్ని మంచి పాత్రలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ఒకవైపు విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూనే.. మరోవైపు మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాలను అనుసరిస్తూ పాయల్ తన వృత్తిని కొనసాగిస్తున్నారు.