తండ్రిపై పాయల్ ఎమోషనల్ పోస్ట్!
రీసెంట్ గా టాలీవుడ్ లో నెపోటిజం గురించి కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన పాయల్ ఇప్పుడు ఓ పోస్ట్ షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ అయింది.
By: Tupaki Desk | 8 April 2025 4:08 PM ISTఆర్ఎక్స్100, మంగళవారం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్‌ను, వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాల్ని తెలుపుతూ ఉంటుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో నెపోటిజం గురించి కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన పాయల్ ఇప్పుడు ఓ పోస్ట్ షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ అయింది.
ఆ పోస్ట్ లో పాయల్ తన తండ్రి గురించి చెప్పుకొచ్చింది. తన తండ్రి ఎసోఫెగల్ కార్సినోమా అంటే జీర్ణాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారని, దానికి ట్రీట్‌మెంట్ ను ఇప్పుడే మొదలుపెట్టామని, మొదటి కీమోథెరపీ సెషన్ పూర్తైందని పాయల్ తన తండ్రి అనారోగ్యం గురించి వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తాను ఎంతో భయపడినట్టు పాయల్ తెలిపింది.
తన తండ్రి త్వరలో కోలుకుంటారని, దానికి అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని పాయల్ కోరింది. క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ హాస్పిటల్ లో ఉన్నప్పటికీ తన తండ్రి తనను షూటింగ్ కు వెళ్లమని చెప్తున్నారని, తన తండ్రి ఈ టైమ్ లో కూడా తనకు ధైర్యాన్ని ఇస్తున్నారని, తాను షూటింగ్ లతో బిజీగా ఉన్నా, తన తండ్రిని హాస్పిటల్ లో జాగ్రత్తగా చూసుకుంటున్న టీమ్ తో పాటూ కిమ్స్ హాస్పిటల్ కు, ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్లకు కూడా పాయల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ తన తండ్రి చేతికి సెలైన్ ఎక్కిస్తున్న ఫోటోను షేర్ చేసింది.
పాయల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు. ఇప్పటికే పాయల్ కు రాయ్ లక్ష్మీ, సిమ్రత్ కౌర్, దివ్య పిళ్లై లాంటి వారు రిప్లైలు ఇచ్చారు. మరోవైపు పాయల్ అభిమానులు కూడా ఆమెకు ధైర్యాన్ని చెప్తూ తన తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు మెసెజ్‌లు పెడుతున్నారు.
ఇక పాయల్ కెరీర్ విషయానికొస్తే అమ్మడికి ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. మంగళవారం సినిమా సక్సెస్ అయినప్పటికీ ఆ సినిమా తర్వాత కూడా పాయల్ కు పెద్దగా ఛాన్సులు రాలేదు. మంగళవారం2 అంటున్నారు కానీ అందులో పాయల్ కాకుండా మరో హీరోయిన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు తమిళ సినిమాలు, ఒక తెలుగు సినిమా వస్తోంది.
