Begin typing your search above and press return to search.

పాపం.. పవన్ డైరెక్టర్స్!

కరోనాకి ముందు 'వకీల్ సాబ్' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

By:  Tupaki Desk   |   11 Feb 2024 4:30 PM GMT
పాపం.. పవన్ డైరెక్టర్స్!
X

కరోనాకి ముందు 'వకీల్ సాబ్' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కెరీర్ లో మునుపెన్నడూ లేని విధంగా వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ, ఒకేసారి రెండు మూడు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటూ వచ్చారు. ఓవైపు ఏపీలో రాజకీయాలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తూ రెండు పడవల మీద ప్రయాణం సాగించారు. అయితే పవర్ స్టార్ రీమేకులకే మొదటి ప్రాధాన్యతా ఓటు వేయడంతో సినిమాల క్రమం ఎప్పటికప్పుడు మారిపోతూ వచ్చింది. దీని కారణంగా కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు, చాలా ఏళ్లుగా పవన్ కాల్షీట్స్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' అనే పీరియాడిక్ అడ్వెంచర్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' టైంలో 'PSPK 27' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన చిత్రమిది. నాలుగేళ్ల క్రితమే ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు కానీ, ఇంతవరకూ గుమ్మడికాయ కొట్టలేకపోయారు. అదే సమయంలో పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నీ తానై చూసుకున్న 'భీమ్లా నాయక్', 'బ్రో' సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలోకి వచ్చాయి.. ఆ తర్వాత ఓటీటీ, టీవీల్లోకి కూడా వచ్చేసాయి. మధ్యలో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు వచ్చాయి. కానీ పవన్ 27వ సినిమాగా అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన వీరమల్లు షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది.

'హరి హర వీరమల్లు' మొదలైన తర్వాత కోవిడ్ పాండమిక్ రావడంతో, క్రిష్ మెగా మేనల్లుడితో 'కొండపొలం' అనే చిన్న సినిమా చేయాల్సి వచ్చింది. వెంటనే మళ్ళీ తన ప్రాజెక్ట్ మీదకు వచ్చేసారు. అప్పట్నుంచి ఇప్పటివరకు అదే సినిమా మీద ఉన్నారు. ముందుగా ఈ చిత్రాన్ని 2021 లో రిలీజ్ చేస్తామని ప్రకటించిన నిర్మాత ఏఎం రత్నం.. 2022 సమ్మర్ లో విడుదల చేస్తామన్నారు.. ఆ తర్వాత 2023 వేసవికి అన్నారు. చివరగా 2024 ఎలక్షన్స్ కు ముందే తమ సినిమా వస్తుందన్నారు. ప్రతీ ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్ డేకి కొత్త పోస్టర్ అయితే వస్తుంది కానీ, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం భేతాళ ప్రశ్నగా మారింది.

ఇప్పుడు లేటెస్టుగా 'హరి హర వీరమల్లు' మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఐదేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్న డైరెక్టర్ క్రిష్.. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్ కు షిఫ్ట్ అవుతున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అగ్ర కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే ఈ వార్తలను ఎవరూ ఖండించకపోవడం, పవన్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది నిజమేనేమో అనే భావన కలుగుతుంది. ఇదంటుంచితే అసలు పవన్ కళ్యాణ్ సినిమా నుంచి దర్శకుడు పూర్తిగా తప్పుకున్నాడనే పుకారు కూడా ఒకటి వినిపిస్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే, క్రిష్ కంటే ముందు వేరే సినిమా చూసుకున్న పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీశ్ శంకర్. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ మూడేళ్ళ క్రితమే PSPK28 వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ రీమేక్ ప్రాజెక్ట్, లేట్ అవుతూ వస్తోంది. 'భవదీయుడు భగత్ సింగ్' నుంచి 'ఉస్తాద్..' గా పేరు మార్చుకుంది కానీ, షూటింగ్ పూర్తి చేసుకోలేకపోయింది. 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ రెండు కీలకమైన షెడ్యూల్స్ చిత్రీకరణ జరుపుకుంది కానీ, తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది క్లారిటీ లేకుండా పోయింది.

2019లో 'గడ్డలకొండ గణేష్' సినిమా చేసిన హరీష్ శంకర్.. అప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ కోసం వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్ చేసారు కానీ, మైత్రీ మేకర్స్ తగినన్ని డేట్స్ సంపాదించలేకపోయారు. దీంతో మొన్న సంక్రాంతికి వస్తుందనుకున్న సినిమా, ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత రావడం లేదు. ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా పవన్ తోనే సినిమా చేయాలని వెయిట్ చేసిన హరీష్.. మాస్ మహారాజా రవితేజతో 'మిస్టర్ బచ్చన్' మూవీ చేయడానికి రెడీ అయిపోయారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఏపీ ఎన్నికల తర్వాత జనసేనాని నిర్ణయాన్ని బట్టి మళ్ళీ 'ఉస్తాద్ భగత్ సింగ్' ను షురూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పవర్ స్టార్ తో సినిమా చేయాలని వేచి చూస్తున్న దర్శకులలో సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్' అంటూ 2021లోనే వీరి కాంబినేషన్ పై అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.. ఎక్కడా దీని ఊసే లేదు. పవన్ పుట్టినరోజులకు మాత్రమే ఒక పోస్టర్ రిలీజ్ చేసి, ఈ సినిమా ఒకటి వుందని మేకర్స్ గుర్తు చేస్తూ వచ్చారు. ఈ గ్యాప్ లో అఖిల్ అక్కినేనితో 'ఏజెంట్' వంటి డిజాస్టర్ మూవీ తీసి వచ్చారు సూరి. మళ్ళీ ఇప్పుడు పవన్ సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవలే వక్కంతం వంశీతో కలిసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసారు. నిర్మాత పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి కాబట్టి, ఎప్పుడైనా డేట్స్ దొరికే అవకాశం ఉందని భావించవచ్చు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ దర్శకులలో సుజీత్ ఒక్కడే లక్కీ అని చెప్పాలి. మిగతా వాళ్ళ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయనే డైలమాలో ఉన్నప్పుడే, OG చిత్రాన్ని అనౌన్స్ చేసి షూటింగ్ మొదలుపెట్టేసారు. హీరో డేట్స్ సంపాదించి, అనుకున్న విధంగానే వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2024 సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు కాబట్టి, ఎలక్షన్స్ తర్వాత అయినా పవన్ కాల్షీట్స్ ఇస్తారనే క్లారిటీ వచ్చేసింది. అది కూడా త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో డేట్స్ ఇస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏదైతేనేం మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే సుజీత్ అదృష్టవంతుడనే అనుకోవాలి. ఇక ఎన్నికల తర్వాత జనసేనాని తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఇతర దర్శకుల భవితవ్యం ఉంటుంది.